SC On Religious Conversion : మతమార్పిళ్ల అంశం చాలా తీవ్రమైనదని.. దీనికి రాజకీయ రంగు పులమకూడదని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. మోసపూరిత మతమార్పిళ్లను అరికట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఈ వ్యాఖ్యలు చేసింది. బెదిరింపులు, మోసం, కానుకలు ఆశ చూపి బలవంతంగా చేసే మతమార్పిళ్లకు సంబంధించిన కేసు విచారణకు సహకారం అందించాలని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణిని జస్టిస్ ఎమ్.ఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం కోరింది.
అయితే విచారణ ప్రారంభంలో తమ రాష్ట్రంలో ఎలాంటి మతమార్పిళ్లు జరగలేదని.. ఇదంతా రాజకీయ కక్షసాధింపు చర్యలని తమిళనాడు తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై బెంచ్ తీవ్ర అభ్యంతరం తెలిపింది."మీరు ఇలా వ్యాఖ్యానించడానికి వేరే కారణాలు ఉండవచ్చు. కానీ కోర్టు వ్యవహారాలను ఇతర విషయాల్లోకి మళ్లించవద్దు. మేము మొత్తం దేశం కోసం ఆందోళన చెందుతున్నాము. ఇది మీ రాష్ట్రంలోనే జరిగితే బాధాకరం.. జరగకపోతే మంచిది. ఇది ఒక రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు చూడవద్దు. దీన్ని రాజకీయం చేయొద్దు" అని హితవు పలికింది. ఈ కేసు విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.
బలవంతపు మతమార్పిళ్లు దేశ భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నాయని.. పౌరుల మతస్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇది చాలా తీవ్రమైన అంశమని.. దీనిని అరికట్టేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఇటీవలే కేంద్రానికి సూచించింది. ఇతరులను బలవంతంగా మతం మార్పించడమన్నది మతస్వేచ్ఛ పరిధిలోకి రాదని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మోసం, బలప్రయోగం, ఆకర్షణల ద్వారా మతమార్పిళ్లకు పాల్పడితే మతస్వేచ్ఛను ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. అలాంటి చర్యలను నిరోధించేందుకు అవసరమైన చట్టాలు చేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది.