గుజరాత్ అల్లర్ల వేళ సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయడంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దోషుల విడుదలను సవాల్ చేస్తూ బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. రెమిషన్ మంజూరు చేయడానికి సంబంధించిన పత్రాలను ఏప్రిల్ 18లోగా సిద్ధం చేసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అత్యాచారం కేసులో దోషులైన 11 మందిని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు బిల్కిస్ బానో. జస్టిస్ కేఎం జోసేఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. ఈ కేసు భావోద్వేగాలతో కాకుండా, చట్ట ప్రకారం విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశమంతా అజాదీ కా అమృత్ మహోత్సవాలు చేసుకుంటున్న సమయంలో దోషులను విడిచిపెట్టారని.. వారిని పూలమాలలతో సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారని వ్యాఖ్యానించింది. అంతకుముందు జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే జనవరి 4న త్రివేది కారణం చెప్పకుండా కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. బాధితురాలితో పాటు అనేక మంది ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు.