NEET PG: పీజీ మెడికల్ 2021 కౌన్సెలింగ్‌పై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. మిగిలిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది అత్యున్నత న్యాయస్థానం. 1456 పీజీ మెడికల్ సీట్లు మిగలడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వైద్య విద్యలో రాజీ పడలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. మిగిలిన సీట్లను ఇప్పుడు భర్తీ చేస్తే.. ప్రస్తుత ఏడాదిపై ప్రభావం పడుతుందన్న కేంద్రం వివరణతో ఏకీభవిస్తున్నామన్న ధర్మాసనం.. పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు తెలిపింది.
నీట్ పీజీ 2021: ఆ పిటిషన్లను కొట్టేసిన సుప్రీం.. కేంద్రంపై ఆగ్రహం - సుప్రీం కోర్టు నీట్ పీజీ 2021
10:52 June 10
నీట్ పీజీ 2021: ఆ పిటిషన్లను కొట్టేసిన సుప్రీం.. కేంద్రంపై ఆగ్రహం
మిగిలిపోయిన 1456 సీట్లకు మరో రౌండ్ ప్రత్యేక స్ట్రే కౌన్సెలింగ్ నిర్వహించాలన్న పిటిషన్లపై.. జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ అనిరుద్ధ బోస్ ధర్మాసనం రెండు రోజుల పాటు విచారణ జరిపింది. పీజీ కౌన్సెలింగ్‌లో ఏటా భారీగా సీట్లు మిగలడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. దీనిపై 24 గంటల్లో ప్రమాణపత్రం దాఖలు చేయమని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ), కేంద్రం గురువారం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాయి. మిగిలిపోయిన సీట్లలో ఎక్కువ నాన్ క్లినికల్ విభాగానికి చెందినవేనని ఎంసీసీ పేర్కొంది. వీటికి దరఖాస్తులు రావడం లేదని చెప్పింది. 2021లో 1456 సీట్లలో 800 నుంచి 900 సీట్లను ఎంపిక చేసుకున్నారని.. కానీ తర్వాత విద్యార్థులు వాటిలో అడ్మిషన్ తీసుకోలేదని తెలిపింది. పీజీ 2021 కోర్సు ప్రారంభమై ఏడాదిన్నర అవుతోందని, ఇప్పుడు ఈ సీట్లకు మళ్లీ కౌన్సెలింగ్ నిర్వహిస్తే.. విద్యార్థుల చదువులు ప్రభావితమవుతాయని ధర్మాసనానికి విన్నవించింది.
కేంద్రం, ఎంసీసీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం బుధవారం.. తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. నేడు ఆ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. వైద్య విద్య, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రత్యేక స్ట్రే రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించకూడదని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ), కేంద్రం నిర్ణయం తీసుకుందని కోర్టు ఈ సందర్భంగా తెలిపింది.
ఇవీ చూడండి:యుక్త వయసు రాకముందే రజస్వల.. లాక్‌డౌన్‌లో 3.6 రెట్లు అధికం!