జులై 31లోగా 12వ తరగతి ఇంటర్నల్ అసెస్మెంట్ ఫలితాలు ప్రకటించాలని రాష్ట్రాల ఎడ్యుకేషన్ బోర్డులను సుప్రీంకోర్టు ఆదేశించింది. గ్రేడ్ల నిర్ధరణకు అన్ని రాష్ట్రాలకూ ఒకే విధానం సరిపడదని, ఆయా బోర్డులు సొంత పద్ధతుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
మార్కుల కేటాయింపు విధివిధానాలను జూన్ 24నుంచి పది రోజుల్లో ఖరారు చేయాలని సూచించింది సుప్రీంకోర్టు. బోర్డులు స్వతంత్రమైనవే కాబట్టి కారణాలు చెప్పకుండా పని పూర్తి చేయాలని తెలిపింది.
కొవిడ్-19 కారణంగా రద్దు అయిన 12వ తరగతి పరీక్షలకు సంబంధించి ఫలితాలను ప్రకటించేందుకు అన్ని విద్యా బోర్డులు ఒకే విధానాన్ని పాటించేలా ఆదేశాలివ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించింది. అసోంలో 12వ తరగతి పరీక్షలను రద్దు చేసి మార్కులు ప్రకటించే విధానాన్ని స్వంతగా ఆ రాష్ట్రం చేపట్టిందని గుర్తు చేసింది. అంతేకాకుండా ఎడ్యుకేషన్ బోర్డులు స్వయం ప్రతిపత్తి కలిగినవి కాబట్టి.. ఫలితాల విడుదలలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
కరోనా కారణంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 12వ తరగతి పరీక్షలను రద్దు చేశాయి. అయితే ఫలితాలను ప్రకటించేందుకు అన్ని రాష్ట్రాల బోర్డులు ఒకే విధాన్ని పాటించేలా ఆదేశాలివ్వాలని సుప్రీం కోర్టులో కొందరు పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశించింది.
ఇదీ చదవండి:West Bengal: మమత 'నందిగ్రామ్' పిటిషన్పై తీర్పు వాయిదా