దేశంలో కరోనా వ్యాక్సినేషన్ విధివిధానాల రూపకల్పనకు కేంద్రం చేపట్టిన చర్యలేంటి, ఎలాంటి సమాలోచనలు చేసింది అనే వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రతి పత్రాన్ని, సమాచారాన్ని అందజేయాలని స్పష్టం చేసింది. అలాగే ఇప్పటివరకు మొత్తం ఎన్ని టీకాలు కొనుగోలు చేశారు? అనే వివరాలను కూడా తమ ముందు ఉంచాలని పేర్కొంది.
మే 31న వ్యాక్సినేషన్ పాలసీపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఈ వివరాలు అడిగింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను అధికారిక వెబ్సైట్లో బుధవారం పొందుపర్చింది.
"కేంద్రం ఇప్పటివరకు ఎన్ని కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వి టీకాలు కొనుగోలు చేసింది. ఈ మూడు వ్యాక్సిన్ల కొనుగోలుకు ఆదేశాలు జారీ చేసిన తేదీలు, ఏ రోజు ఎన్ని టీకా డోసులు ఆర్డర్ చేశారు, వాటి సరఫరా ఎప్పుడు జరిగిందనే వివరాలు అఫిడవిట్లో క్షుణ్నంగా ఉండాలి" అని జస్టిస్ డీవై చంద్రచూద్, జస్టిస్ ఎల్ఎన్ రావు, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్‌తో కూడిన ప్రత్యేక ధర్మాసనం కేంద్రానికి స్పష్టం చేసింది. ఈ వివరాలు సమర్పించేందుకు రెండు వారాలు గడువిచ్చింది.
కరోనా టీకా పొందాలంటే కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని మే 31న సుప్రీంకోర్టు కేంద్రానికి తెలిపింది. టీకాల ధరల్లో వ్యాత్యాసం ఎందుకుందని ప్రశ్నించింది. వ్యాక్సిన్ పాలసీ విధానకర్తలకు క్షేత్రస్థాయి అవగాహన ఉండాలని సూచించింది. అన్ని టీకాల ధరలు ఒకేలా ఉండేలా చర్యలు తీసుకోవాలంది. వ్యాక్సినేషన్ పాలసీ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.
ఇదీ చదవండి: Vaccine: 'టీకాల విధానంలో ఇన్ని లోపాలా?'