కొవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం విషయంలో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. 'బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ఇవ్వొద్దని ప్రధాని నేతృత్వంలోని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) చెప్పిందా' అంటూ ప్రశ్నించింది. ఈ పరిహారాన్ని బాధితుల గుండెల్లో బాధను నివారించడానికి ఒక పరిహార పథకంగా పరిగణించవచ్చని వ్యాఖ్యానించింది.
తలకు మించిన భారం
అయితే బాధిత కుటుంబాలకు పరిహారం అందించలేమని ఇప్పటికే ప్రమాణ పత్రం దాఖలు చేసింది కేంద్రం. పరిహారం చెల్లించడం.. ఆర్థిక స్థోమతకు మించి భారం మాత్రమే కాదని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుందని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. తమ వద్ద అంత డబ్బు లేదని కేంద్రం.. సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఎన్డీఎంఏ వద్దని చెప్పిందా?
"మీరు (కేంద్రం) స్పష్టత ఇవ్వడం సరైనదే. ప్రభుత్వం డబ్బు లేదని చెప్పడంలో విస్తృతమైన పరిణామాలు ఉన్నాయి" అని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది. అయితే విపత్తు నిర్వహణ చట్టం 2005 సెక్షన్ 12 ప్రకారం.. ప్రకృతి విపత్తులతో మరణించిన వారికి పరిహారం పొందే హక్కుందని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు విపత్తులను ఎదుర్కోవటానికి ఆర్థిక సంఘం సిఫార్సులు చేసినట్లు తెలిపింది. అయితే "పరిహారం ఇవ్వకూడదని ప్రధాని నేతృత్వంలోని ఎన్డీఎంఏ ఏదైనా నిర్ణయం తీసుకుందా?" అని కేంద్రాన్ని ప్రశ్నించింది ధర్మాసనం.