నవంబర్లో జరిగే జాతీయ డిఫెన్స్ అకాడమీ ప్రవేశ పరీక్షకు (NDA Exam november 2021) మహిళలకు అవకాశం కల్పించాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వచ్చే ఏడాది నుంచి మహిళలను అనుమతిస్తామని కేంద్రం చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చింది. (NDA Exam Women) మహిళలకు అవకాశం కల్పించేందుకు 2022 వరకు వేచి చూడలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళల హక్కులను కాలరాయలేమని స్పష్టం చేసింది.
కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి.. డిఫెన్స్ సర్వీసెస్ (Defence Services) ఏర్పాటు చేసిన స్టడీ గ్రూప్.. పరీక్షను వాయిదా (NDA exam postponed 2021) వేయాలని సూచించిందని తెలిపారు. మౌలిక సదుపాయాలు, ఫిట్నెస్ ట్రైనింగ్, పాఠ్యాంశాలు తదితర అంశాలను ఈ స్టడీ గ్రూప్ పరిశీలిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో.. మహిళలకు వచ్చే ఏడాది నుంచి అవకాశం కల్పిస్తామని తెలిపారు. 2022 మే నెలలో ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అందుకు అనుమతించాలని కోరారు. అయితే, ఈ విన్నపాన్ని ధర్మాసనం తిరస్కరించింది.
"మీ సమస్యలన్నింటినీ గుర్తిస్తున్నాం. కానీ దీనికి పరిష్కారాలను వెతికే సామర్థ్యం మీకు ఉందని మా నమ్మకం. ఫిట్నెస్ టెస్టులు వంటివి ప్రతిపాదిస్తున్నారు. వివిధ అంశాలపై మీరు చేస్తున్న ప్రయత్నాలు స్వాగతించదగినవి. కానీ, పరీక్షను మరో ఏడాది పాటు వాయిదా వేయడమే మాకు కష్టంగా కనిపిస్తోంది. నవంబర్లో పరీక్షకు అనుమతిస్తామని ఆశ కల్పించి.. ఇప్పుడేమో భవిష్యత్లో అవకాశం వస్తుందని మేం ఆ ఆశను తుంచేయాలని అనుకోవట్లేదు."