ఉత్తర్‌ప్రదేశ్‌లో 69 వేల ప్రాథమిక ఉపాధ్యాయ పోస్టుల విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ముందుగా ప్రకటించిన ఫలితాల ఆధారంగానే భర్తీ చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతించింది. మేలో విడుదలైన అసిస్టెంట్ బేసిక్ టీచర్ ఫలితాలను సవాలు చేస్తూ యూపీ ప్రాథమిక్ శిక్షా మిత్రా అసోసియేషన్.. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
గతంలో ఇచ్చిన అలహబాద్ హైకోర్టు తీర్పును ధర్మాసనం సమర్థించింది. యూపీ ప్రభుత్వం ప్రకటించిన కటాఫ్ మార్కుల ప్రకారమే నియామకాలు జరుపుకోవచ్చని తీర్పు చెప్పింది. గతేడాది జనవరిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కనీస అర్హత మార్కులుగా జనరల్ కెటగిరీ అభ్యర్థులకు 65, రిజర్వేషన్ అభ్యర్థులకు 60 మార్కులను యూపీ సర్కారు కేటాయించింది.