Sankranti Cock Fight 2024 :ఏపీలో నిబంధనలతో సంబంధం లేదు! మాకు నచ్చినట్లు చేసుకుంటాం! అధికార పార్టీ నేతల అండదండలున్నాయ్! అంతా మా ఇష్టం అన్నట్లుగా కోడిపందేల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. పందేలపై ఏపీ హైకోర్టు అంక్షలున్నా క్షేత్ర స్థాయిలో అవి బుట్టదాఖలవుతున్నాయి. సంక్రాంతి పండుగ వేళ రాష్ట్రంలో రెండో రోజూ యథేచ్ఛగా కోళ్ల పందేలు సాగాయి. పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన బరుల్లో భారీగా నోట్ల కట్టలు చేతులు మారాయి. గుండాట, జూదం, పొట్టేళ్ల పందేలూ జోరుగా సాగాయి.
AP High Court Rules on Sankranti Kodi Pandalu : స్వాగత ఫ్లెక్సీలు, షామియానాలు, వీఐపీలకు, సాధారణ వ్యక్తులకు వేర్వేరుగా గ్యాలరీలు, ఫ్లడ్‌లైట్ల వెలుగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రేక్షకులు, పందెం రాయుళ్లు ! ఇవీ ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా, గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న దృశ్యాలు. సంక్రాంతిని పురస్కరించుకుని మూడు రోజుల పాటు కోడి పందేలు, గుండాట, జూద క్రీడలు నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లు చూస్తే ఔరా అనాల్సిందే. పందేలను నిలువరించాలని హైకోర్టు స్పష్టం చేసినా వాటి అమలులో అధికారులు విఫలం కావడంలో బరుల వద్ద భారీగా నగదు చేతులు మారుతోంది.
సంక్రాంతి వేళ జోరుగా సాగుతున్న పోటీలు - భారీగా తరలివస్తున్న ప్రజలు
బరుల వద్ద జోరుగా మద్యం విక్రయాలు :ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అంపాపురం, ఈడుపుగల్లు వద్ద భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి పక్కనే పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కోడి పందేలు, జూదం, గుండాట నిర్వహించారు. బరుల వద్ద జోరుగా మద్యం విక్రయాలు సాగాయి. కార్యక్రమాల నిర్వహణకు అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో పోలీసులు మిన్నకుండిపోయారు.