S 400 Missile System: గగనతలాన్ని దుర్భేద్యంగా మార్చేందుకు భారత్ కొత్త ఆయుధ వ్యవస్థను సమకూర్చుకుంది. ఇండియా అమ్ముల పొదిలో 'ఎస్-400 ట్రయాంఫ్' గగనతల రక్షణ వ్యవస్థ చేరింది. దీనితో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి చైనా ఆధిపత్యానికి గండిపడనుంది. భారత వైమానిక దళ స్థావరాలతో పోలిస్తే డ్రాగన్‌వి భౌగోళికంగా బాగా ఎత్తులో ఉన్నాయి. సహజంగా ఎత్తు ప్రదేశాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉండటంతో, యుద్ధ విమానాల ఇంజిన్లు పూర్తి సామర్థ్యంతో పని చేయలేవు. ఈ లోపాన్ని భర్తీ చేసుకోవడానికి చైనా రాకెట్‌ఫోర్స్‌ను లద్దాఖ్‌కు తరలించింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400ను కూడా అక్కడికి చేర్చింది. ఈ వ్యవస్థ 600 కిలోమీటర్ల దూరంలోని విమానాలు, రాకెట్లను గుర్తించి, 400 కిలోమీటర్ల దూరంలోనే కూల్చివేయగలదు. ఫలితంగా భారత విమానాలు దాని దృష్టి నుంచి తప్పించుకోలేని పరిస్థితి నెలకొంది. 2018లో భారత్ కొనుగోలు చేసిన ఎస్-400 వ్యవస్థలు ఇటీవలే అందుబాటులోకి రావడం మొదలైంది. ఫలితంగా ఎల్‌ఏసీ వద్ద డ్రాగన్ ఆధిపత్యానికి గండిపడి భారత్‌ది పైచేయి కానుంది. ఎందుకంటే, చైనా క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్)లో భాగస్వామి కాదు. అందువల్ల డ్రాగన్ వాడే ఎస్-400లకు రష్యా అధికారికంగా 300 కిలోమీటర్ల రేంజికి మించిన క్షిపణులను సరఫరా చేయకూడదు. ఎంటీసీఆర్ సభ్యదేశం కావడంతో భారత్‌కు ఆ ఇబ్బంది లేదు.
సామర్థ్యం మెరుగుదల
కొత్త వ్యవస్థతో సుదూరాల్లో శత్రువుల కదలికలను మందగింపజేసి, వివాదాస్పద ప్రదేశంలోకి ప్రవేశించిన ప్రత్యర్థుల్ని నిలువరించే సామర్థ్యం భారత్‌కు మెరుగు పడుతుంది. గగనతలంలో దూసుకొచ్చే ముప్పులను పసిగట్టేందుకు పాకిస్థాన్ వద్ద దాదాపు తొమ్మిది అవాక్స్ నిఘా విమానాలు ఉన్నాయి. భారత్ వద్ద ఆ స్థాయిలో అవాక్స్‌లు లేవు. ఫలితంగా ఎస్-400 రాకతో భారత సరిహద్దులకు 600 కిలోమీటర్ల సమీపానికి నిఘా విమానాలు పంపేందుకు పాక్ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఫలితంగా నియంత్రణ రేఖ వద్ద భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్-400ను మిగిలిన క్షిపణి రక్షణ వ్యవస్థలతో అనుసంధానించే అవకాశం ఉండటం మనకు కలిసివచ్చే అంశం. ప్రస్తుతం భారత్ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ, పృథ్వీ గగనతల రక్షణ వ్యవస్థలను దీనికి అనుసంధానించే అవకాశాలు ఉన్నాయి. గగనతల రక్షణ బాధ్యతలు చూసుకొనే భారత వైమానిక సేనకు 42 స్క్వాడ్రన్లు అవసరం; ప్రస్తుతం దాదాపు 30 మాత్రమే ఉన్నాయి. వచ్చే పదేళ్లలో ఈ సంఖ్య 35కు పెరగవచ్చని వైమానిక దళాధిపతి వీఆర్‌చౌధరి అక్టోబరులో వెల్లడించారు. ఇప్పటికిప్పుడు భారీయెత్తున యుద్ధ విమానాలు కొనుగోలు చేసే పరిస్థితి లేనందువల్ల అయిదు ఎస్-400 వ్యవస్థలు యుద్ధవిమానాల కొరతను అంతగా కనిపించనీయకపోవచ్చు.
గగనతల రక్షణ వ్యవస్థ నిర్వహణ అత్యంత ఖర్చుతో కూడుకొన్నదన్న వాస్తవం ఇటీవల హమాస్- ఇజ్రాయెల్ పోరులో వెల్లడైంది. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాక వాటి వార్‌హెడ్లు వాతావరణంలోకి ప్రవేశించి లక్ష్యంపై పడే క్రమంలో, శబ్దం కంటే కొన్ని రెట్లు అధిక వేగాన్ని అందుకొంటాయి. ఆ సమయంలో గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకోవడం చాలా కష్టం. ఎస్-400లో ఈ సమస్యను పరిష్కరించేందుకు రష్యా ప్రస్తుతం 77ఎన్6 క్షిపణులను అభివృద్ధి చేస్తోంది. రష్యా కూడా సిరియా యుద్ధంలో ఇజ్రాయెల్‌ను ఎదుర్కొనేందుకు ఎస్-400లను వాడకపోవడం గమనార్హం. అందుకని, ఆయుధాలు అమ్ముకొనేందుకు ఆయా దేశాల ప్రచారాలను పూర్తిగా నమ్మకూడదనేందుకు అమెరికా 'పేట్రియాట్' ప్రచారమే ఓ ఉదాహరణ. 1991లో ఇరాక్ నుంచి ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన స్కడ్ క్షిపణులను తమ పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్లు అమెరికా ప్రచారం చేసుకొన్నా, అది వాస్తవం కాదని ఆ తరవాత వెల్లడైంది.
ఆంక్షలు విధించే అవకాశం