ఇంధన ధరలను పెంచుతూ ప్రజల శ్రమను దోచుకుని ప్రభుత్వం లాభాలను ఆర్జించాలని యత్నిస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. పెట్రో ధరలను తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సోనియా లేఖ రాశారు. జీడీపీ పతనమై, ఇంధన ధరలు అదుపు లేకుండా పెరుగుతున్నాయని సోనియా తన లేఖలో పేర్కొన్నారు.
"ఓ వైపు ఉద్యోగాలు, వేతనాలు కోల్పోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్రవ్యోల్బణంతో నిత్యావసరాల ధరలు పెరిగి మధ్యతరగతి ప్రజలు సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల శ్రమను దోచుకుని ఆదాయాన్ని ఆర్జించాలని చూస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెట్రో ధరలు పెరిగిపోతున్నాయి. ఇంధన ధరలను తగ్గించి మధ్య తరగతి వర్గాలు, రైతులు, పేదలకు ప్రయోజనాలు చేకూర్చాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను."