Revanth Reddy Swearing Ceremony Time Changed : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమవుతోంది. ఎల్బీ స్టేడియంలో గురువారం రోజున జరగబోయే రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో స్వల్ప మార్పు చేశారు. రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
తొలుత గురువారం ఉదయం 10.28 గంటలకు ప్రమాణస్వీకారం చేయడానికి ముహుర్తం నిర్ణయించగా తాజాగా మధ్యాహ్నం 1.04 గంటలకు మార్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు రానున్నారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను సీఎస్, డీజీపీ, తదితర ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Revanth Reddy Swearing Ceremony Guests List :మరోవైపు దిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి ఏఐసీసీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం 50 నిమిషాల పాటు సాగింది. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేలను రేవంత్ రెడ్డి స్వయంగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. వారితో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కన్నడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, చంద్రబాబు ఇతర రాష్ట్రాల నేతలను ఆహ్వానించారు.