కర్ణాటకలో ఓ రిటైర్డ్ ఇంటిలిజెన్స్ అధికారి కారు ప్రమాదంలో మృతి చెందారు. యూనివర్సిటీ ఆఫ్ మైసూరులోని మానస గంగోత్రి ప్రాంగణంలో నడుచుకుంటూ వెళ్తుండగా.. ఓ కారు అతన్ని ఢీకొట్టింది. అయితే.. హత్యగా భావించిన పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..
సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఆర్ఎన్ కులకర్ణి (83) మానస్ గంగోత్రి ఆవరణలోని ఓ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎదురుగా వచ్చిన ఓ గుర్తు తెలియని కారు అతన్ని ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు.. దీన్ని హత్యగా అనుమానిస్తున్నారు. నడుచుకుంటూ వెళ్తున్న కులకర్ణిని నేమ్ ప్లేట్ లేని ఓ కారు ఉద్దేశపూర్వకంగానే.. ఢీకొట్టి వెళ్లిందని సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ చంద్రగుప్తా తెలిపారు. ఈ విషయమై జయలక్ష్మీపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని కమిషనర్ తెలిపారు. దర్యాప్తు కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
నగల వ్యాపారి దారుణ హత్య..
బిహార్‌లో రెండురోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన ఓ నగల వ్యాపారి.. ఆదివారం కాలువలో శవమై కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. ఈ హత్యతో సంబంధం ఉన్నట్లుగా భావించి ఓ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు.
పోలీసుల కథనం ప్రకారం.. ఆరా ప్రాంతానికి చెందిన హరిజీ గుప్తా అనే నగల వ్యాపారి బుధవారం కిడ్నాప్‌నకు గురైయ్యాడు. కుటుంబ సభ్యులు అతని కోసం గాలించినా ఫలితం లేకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. హరిజీ గుప్తాకు ఆరాలో మూడు బంగారు దుకాణాలు, పట్నాలో రెండు దుకాణాలు ఉన్నాయి. వాటితో పాటుగా.. ఆరా బైపాస్ రోడ్‌లోని మార్కెట్లో కొన్ని దుకాణాలు ఉన్నాయి. కాగా, హరిజీ వృత్తిరీత్యా న్యాయవాది. బుధవారం రాత్రంతా గుప్తా ఫోన్ మోగుతూనే ఉందని.. గురువారం ఉదయానికి స్విఛ్ ఆఫ్‌గా వచ్చిందని మృతుడి కుటుంబీకులు తెలిపారు.