కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు కోరుతూ గతంలో అధిష్ఠానానికి లేఖ రాసి జీ 23గా ముద్రపడ్డ సొంత పార్టీ వర్గంపై తాజాగా సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మండిపడ్డారు. పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని బహిరంగంగా డిమాండ్ చేయడాన్ని తప్పుబట్టారు. లేఖ రాసిన వారంతా ప్రస్తుతం వారున్న హోదాలకు ఎన్నికల వల్లే ఎదిగారా? అని ప్రశ్నించారు. సంస్కరణలు త్యాగాల వల్లే సాధ్యమని.. ఆకస్మికంగా ప్రశ్నించడం వల్ల కాదని హితవు పలికారు.
ఆయనే పార్టీ నాయకుడు..
'కాంగ్రెస్ పార్టీకి పెద్దాపరేషన్ చేయాలి'అంటూ జీ 23 వర్గంలోని నేత వీరప్ప మొయిలీ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనికి స్పందనగానే ఖుర్షీద్ తాజా వ్యాఖ్యలు చేశారు. అద్భుతమైన వాక్యాలు పరిష్కారం చూపలేవని ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లుగా పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలకు చర్చల ద్వారా ఓ పరిష్కారం చూపాలని హితవు పలికారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలా? లేదా? అనేది రాహుల్ గాంధీయే నిర్ణయించుకుంటారని తెలిపారు. అయితే, అధ్యక్షుడి స్థానంలో ఉన్నా.. లేకపోయినా.. ఆయనే పార్టీ నాయకుడని వ్యాఖ్యానించారు.
"పార్టీకి ఆపరేషన్ చేద్దాం, సంస్కరణలు తీసుకొద్దాం, సంస్థాగతంగా మార్పులు చేద్దాం.. అనడంలో ఉద్దేశమేంటనేది నాకు అర్థం కావడం లేదు. దీనిపై వాళ్లు(జీ 23) స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరుతున్నా. పార్టీ పదవుల్లో మార్పులు చేసి వారికి కీలక పదవులు కట్టబెట్టాలనేది వారి ఉద్దేశమా? ఆపరేషన్, సంస్కరణలు అనడంలో వారి అర్థం అదేనా? ఒకవేళ అదే వారు కోరుకుంటే దాన్ని వారు సంస్కరణలు, ఆపరేషన్లు అనడం సబబు కాదు. అది కేవలం 'నాకు పదవి కావాలి అని కోరుకోవడమే'అవుతుంది. అందుకే దీనిపై చర్చ జరగాలి అంటున్నాను."
-- సల్మాన్ ఖుర్షీద్, కాంగ్రెస్ సీనియర్ నేత