2000 Notes Deposit : పెద్ద నోట్ల మార్పిడికి దాదాపు మూడు నెలల సమయం మిగిలి ఉండగానే బ్యాంకుల్లో 76 శాతం మేర రూ.2000 నోట్లు బ్యాంకులకు తిరిగొచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం ఈమేరకు ప్రకటించింది. ఇందులో 87 శాతం నోట్లు వేర్వేరు బ్యాంక్ ఖాతాల్లో జమ కాగా.. మిగతా 13 శాతాన్ని ఇతర నోట్లుగా మార్చుకున్నట్లుగా ఆర్బీఐ తెలిపింది. మొత్తంగా రూ.2.72 లక్షల కోట్లు విలువగల రూ.2 వేల నోట్లను ప్రజలు ఇప్పటికే బ్యాంకుల్లో డిపాజిట్ చేశారని వివరించింది.
చలామణీలో ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడానికి ఆర్బీఐ ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు దేశప్రజలకు గడువు ఇచ్చింది. వీటిన క్రమంగా ఉపసంహరించుకుంటున్నట్లు మే 19న ప్రకటించింది.
ఆ ఒక్కరోజే 0.84 లక్షల కోట్లు..
RBI On 2000 Notes : దేశంలోని అన్ని బ్యాంకుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. 2023 మే 19 నుంచి జూన్ 30 నాటికి మొత్తం రూ.2.72 లక్షల కోట్ల రూ.2000 కరెన్సీ నోట్లు వివిధ రూపాల్లో బ్యాంకుల్లో ప్రజలు జమ చేశారని ఆర్బీఐ తెలిపింది. కేవలం జూన్ 30 రోజునే స్టాక్ మార్కెట్ల సమయం ముగిసే సమయానికి రూ.0.84 లక్షల కోట్ల రూ.2 వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయని ఆర్బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఆర్బీఐకి ఊరట..
Delhi High Court 2000 Note sc 2000 notes: చలామణీలో ఉన్న రూ.2000 నోట్లను ఉపసంహరించుకోవాలన్న ఆర్బీఐ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. గుర్తింపు కార్డులు లేకుండా రూ.2000 వేల నోట్ల మార్పిడికి అవకాశాన్ని కల్పిస్తూ ఆర్బీఐ, జాతీయ బ్యాంకు ఎస్బీఐలు జారీ చేసిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ మే 29న దిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. దాఖలైన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించాలనే అభ్యర్థనను మే 30న రిజర్వ్‌లో ఉంచిన చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం తాజాగా ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. రూ.2000 కరెన్సీ నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకునే అధికారం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కి లేదని.. ఆర్బీఐ 1934 చట్టంలోని సెక్షన్ 24 (2) ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఈ విషయంలో నిర్ణయం తీసుకునే పూర్తి అధికారాలు ఉంటాయని పిటిషనర్ రజనీష్ భాస్కర్ గుప్తా తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే తాజాగా ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
పిటిషన్ తిరస్కరణ..
HC 2000 Notes : ఎటువంటి గుర్తింపు పత్రం లేకుండా రూ.2000 వేల నోట్ల మార్పిడికి అవకాశాన్ని కల్పిస్తూ ఆర్బీఐ, జాతీయ బ్యాంకు ఎస్బీఐలు జారీ చేసిన నోటిఫికేషన్లకు వ్యతిరేకంగా దిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ కూడా ఇటీవలే తిరస్కరణకు గురైంది. సీనియర్ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఆర్బీఐ నోట్ల ఉపసంహరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.