Ranjeet singh indore traffic cop: రణగొణ ధ్వనుల మధ్య శ్రమ తెలియకుండా ఉండేందుకు డాన్స్ చేస్తూ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసి డాన్సింగ్ ట్రాఫిక్ కాప్‌గా గుర్తింపు పొందిన ఇన్స్పెక్టర్ రంజిత్ సింగ్ మరోసారి నెటిజన్ల ప్రశంసలను అందుకుంటున్నారు. భానుడి భగభగలను కూడా లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న ఆయన ఓ చిన్నారి పట్ల చూపించిన ఔదార్యమే అందుకు కారణం. మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో గురువారం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
ఇదీ జరిగింది.. ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో రంజిత్ బిజీగా ఉన్న సమయంలో రోడ్డు దాటేందుకు వచ్చిన ఓ ఇద్దరు చిన్నారులు ఆయన కంటపడ్డారు. ఇంతలో వాళ్లే రంజిత్ దగ్గరకు వచ్చి రోడ్డు దాటించేందుకు సాయం చేయమని అడిగారు. రెడ్ సిగ్నల్ పడేంత వరకు ఆగమన్న రంజిత్.. ఆ ఇద్దరి కుర్రాళ్లలో ఒకరు చెప్పులు లేకుండా ఉండటం గమనించారు. మండుటెండలో చెప్పులు లేకుండా తిరగడం చూసి జాలిపడిన రంజిత్.. ఆ కుర్రాడిని కాసేపు అయన పాదాల మీద నిల్చోపెట్టుకున్నారు. అనంతరం ఆ బాలుడిని షాపుకు తీసుకెళ్లి మంచి చెప్పుల జత ఒకటి కొనిచ్చారు. మరోవైపు రంజిత్ కాళ్లపై కుర్రాడు నిల్చున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. రంజిత్ చేసిన పనికి స్థానికులతో పాటు ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేశారు.