రాజస్థాన్ అసెంబ్లీలో శుక్రవారం గందరగోళ పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ 2023-24 బడ్జెట్‌కు బదులుగా గతేడాది బడ్జెట్ సారాంశం చదివారని ప్రతిపక్షాలు అరోపించాయి. విపక్ష సభ్యులు ఒక్కసారిగా వెల్‌లోకి దూసుకొచ్చి తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు.
ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ప్రస్తుత ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. దీంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు మొట్టమొదటి సారిగా సీఎం శాసనసభలో బడ్జెన్‌ను చదవడం ప్రారంభించారు. పాఠశాల విద్య, ఉపాధి హామీ పథకం, పేద కుటుంబాలకు రేషన్ వంటి అనేక ప్రకటనలను గహ్లోత్ దాదాపు 8 నిమిషాల పాటు చదివారు. అయితే ఇది గతేడాది బడ్జెట్ కాపీ అని గుర్తించిన ఛీప్ విప్ మహేష్ జోషీ.. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే సీఎం బడ్జెట్ కాపీని చదవడం ఆపేశారు.
ముఖ్యమంత్రి పాత బడ్జెట్‌ను సభలో చదివిన విషయం తెలిసిన వెంటనే విపక్షాలు సభలో నినాదాలు ప్రారంభించాయి. దాదాపు 5 నిమిషాల పాటు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష నేతలు వెల్‌లోకి ప్రవేశించి నినాదాలు చేశారు. వెంటనే స్పీకర్ సీపీ జోషీ సభను అరగంట పాటు వాయిదా వేశారు.