తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జైలు శిక్షను సవాల్​ చేస్తూ సెషన్​ కోర్టు​కు రాహుల్.. సోమవారమే పిటిషన్!

సూరత్ కోర్టు తనపై విధించిన జైలు శిక్షకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ పిటిషన్​ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. సోమవారమే పిటిషన్​ దాఖలు చేయనున్నారని సమాచారం.

rahul gandhi petition in surat sessions court
సూరత్​ సెషన్స్​ కోర్టులో రాహుల్​ గాంధీ పిటిషన్​

By

Published : Apr 2, 2023, 11:36 AM IST

Updated : Apr 2, 2023, 12:32 PM IST

గుజరాత్​లోని సూరత్‌ కోర్టు విధించిన శిక్షను సవాలు చేసేందుకు కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సిద్ధమయ్యారు. సోమవారం ఆయన తన న్యాయవాదులతో కలిసి సూరత్‌ సెషన్స్‌ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయనున్నారని సమాచారం. న్యాయనిపుణులతో కలిసి ఇప్పటికే పిటిషన్‌ తయారు చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో తనని దోషిగా తేలుస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని రాహుల్‌ తన వ్యాజ్యంలో కోరనున్నట్లు సమాచారం. సెషన్స్‌ కోర్టు తీర్పు ఇచ్చే వరకూ తనను దోషిగా తేల్చిన ట్రయల్‌ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే ఇవ్వాలని కూడా రాహుల్‌ అభ్యర్థించనున్నట్లు సమాచారం.

మోదీ ఇంటి పేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం కేసులో సూరత్‌ కోర్టు రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పు రాగానే లోక్​సభ సచివాలయం కూడా తక్షణమే స్పందించి రాహుల్​పై అనర్హత వేటు వేసింది. ఇటీవలే ఆయన నివసిస్తున్న అధికారిక భవనాన్ని కూడా ఈ నెల 22లోపు ఖాళీ చేయాలని ఆదేశించింది.

రాహుల్​పై మరో పరువునష్టం కేసు..
తాజాగా రాహుల్ గాంధీపై మరో పరువునష్టం కేసు దాఖలైంది. ఆర్​ఎస్​ఎస్​పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​ కోర్టులో ఆయన​పై పిటిషన్​ వేశారు ఆర్​ఎస్​ఎస్ కార్యకర్త కమల్ భదౌరియా. 2023 జనవరి 9న హరియాణాలో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్​ గాంధీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్​ఎస్​ఎస్​)ను ఉద్దేశించి విమర్శలు చేశారు. 21వ శతాబ్దానికి చెందిన కౌరవులు ఖాకీ నిక్కరు ధరించి శాఖలు నడుపుతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ కేసుపై ఏప్రిల్ 12న విచారణ జరగనుంది.

రాహుల్​ను బ్రిటన్​ కోర్టుకు లాగుతా..: లలిత్​ మోదీ
రాహుల్​ గాంధీపై ఇటీవలే తీవ్ర విమర్శలు గుప్పించారు ఐపీఎల్​ ఫౌండర్​ లలిత్ మోదీ. వరుస ట్వీట్లతో రాహుల్, ఆయన అనుచరుపై మండిపడ్డారు. 'బ్యాగ్​ మెన్​' చట్టం నుంచి లలిత్​ మోదీ తప్పించుకుని తిరుగుతున్నారంటూ రాహుల్​ తాజాగా వ్యాఖ్యలు చేశారు. వీటి ఆధారంగానే ఆయనను బ్రిటన్​ కోర్టుకు లాగుతానని లలిత్​ హెచ్చరించారు. దేశంలో ప్రతిపక్ష నేతలు సరైన అవగాహన లేకుండా తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
అయితే రాహుల్​ వ్యవహారంపై కాంగ్రెస్​ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల వీరికి విపక్షాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. వీరంతా కలిసి అదానీ కుంభకోణంపై జేపీసీ (జాయింట్​ పార్లమెంటరీ కమిటీ) విచారణ జరపాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.

Last Updated : Apr 2, 2023, 12:32 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details