Rahul Gandhi On Women Reservation Bill : మహిళా రిజర్వేషన్ అమల్లోకి వచ్చేందుకు ఇంకా పదేళ్లు పడుతుందని జోస్యం చెప్పారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి మళ్లించే రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని జనగణన చేయించకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. మహిళల రిజర్వేషన్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటా ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. మహిళా బిల్లును ప్రవేశపెట్టిన సమయంలోనే ఓబీసీ కోటా కల్పిస్తే బాగుండేదని రాహుల్ అభిప్రాయ పడ్డారు. మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి కులగణన, డీలిమిటేషన్ను కారణంగా చూపడం దారుణమని విమర్శించారు రాహుల్. మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కులగణన సమాచారం లేకుండా పథకాలు ఎలా రూపొందిస్తారని నిలదీశారు. ప్రజలకు అధికారం ఇచ్చేందుకు కులగణన అత్యవసరమని.. అధికారంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు.
"రిజర్వేషన్ల అమల్లోనే సమస్య ఉంది. ప్రస్తుతం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడుతున్నాం కానీ.. పదేళ్ల తర్వాతే రిజర్వేషన్లు అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీని అర్థం ఏమిటి ? ఈ బిల్లుకు మేం మద్దతు ఇస్తున్నాం. అయితే జనగణన, డీలిమిటేషన్ నిబంధనలను తొలగించండి. వెంటనే రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురండి. భారత మహిళల తెలివిని మీరు అవమానపరచొద్దు. ఓబీసీ జనగణన నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం జరుగుతోంది. ఓబీసీలకు ఎంతో చేస్తున్నానని ప్రధాని చెబుతున్నారు. అయితే భారత ప్రభుత్వంలో కీలకమైన 90 మంది సెక్రటరీలు, క్యాబినేట్ సెక్రటరీలలో ఎంత మంది ఓబీసీలు ఉన్నారు?"
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత