కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తన వివాహం విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కాబోయే భార్యకు ఉండాల్సిన లక్షణాల గురించి వెల్లడించారు. తన నాయనమ్మ ఇందిరా గాంధీ, తల్లి సోనియా గాంధీలో ఉన్న లక్షణాలు.. జీవితభాగస్వామిలో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. ఇందిరా గాంధీని తనకు రెండో తల్లిగా అభివర్ణించారు. "నాయనమ్మ లక్షణాలు ఆమె(కాబోయే భాగస్వామి)లో ఉంటాయా లేదా అన్నది పెద్దగా పట్టించుకోను. కానీ, నా తల్లి, నాయనమ్మ లక్షణాలు కలిసి ఉంటే బాగుంటుంది" అని చెప్పారు.
పెళ్లిపై స్పందించిన రాహుల్ గాంధీ.. అలాంటి భార్య అయితే ఓకేనట!
జీవిత భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఎలాంటి లక్షణాలు ఉండాలో వివరించారు. ఏం చెప్పారంటే?
తనను ప్రత్యర్థులు 'పప్పు' అని పిలవడంపైనా మాట్లాడారు రాహుల్ గాంధీ. తమలో ఉన్న భయం వల్లే అలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 'నన్ను ఎవరు ఏమని పిలుస్తున్నారనేది పట్టించుకోను. నన్ను తిట్టినా, కొట్టినా.. వారిని నేను ద్వేషించను' అని రాహుల్ పేర్కొన్నారు. మరోవైపు, తనకు సైకిళ్లు, మోటార్ సైకిళ్లు అంటే ఇష్టమని రాహుల్ చెప్పారు. ఓ చైనా కంపెనీ తయారు చేసిన సైకిళ్ల గురించి మాట్లాడారు. తనకు సొంతంగా కారు లేదని చెప్పారు. "కార్లంటే నాకు పెద్దగా ఆసక్తి లేదు. బైక్‌లన్నా పెద్దగా నచ్చదు. కానీ నడుపుతా. కార్లు రిపేర్ చేయడం వచ్చు. వేగంగా వెళ్లడమంటే ఇష్టం" అని చెప్పుకొచ్చారు.