Rahul Gandhi On Agnipath Scheme :కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నివీర్ పథకంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత సైనికుల గుండె ధైర్యాన్ని అవమానించేందుకే ఈ పథకాన్ని రూపొందించారని ఆయన విమర్శించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల కోసం.. ఈ పథకంలో ఎలాంటి ప్రయోజనాలు లేవన్నారు. వారి కోసం ఇచ్చే పింఛన్, ఇతర ప్రయోజనాలు ఎన్డీఏ సర్కార్ తొలగించిదన్నారు.
శనివారం సియాచిన్లో చనిపోయిన అగ్నివీర్అక్షయ్ లక్ష్మణ్ మృతి పట్ల రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. "దేశం కోసం ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయారు. ఆయన సేవలకు గ్రాట్యుటీ, ఇతర మిలిటరీ సదుపాయాలు ఏమీ లేవు. ఫ్యామిలీకి ఫించన్ కూడా లేదు. అక్షయ్ లక్ష్మణ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. దేశ హీరోలను అవమానించేందుకే అగ్నివీర్ పథకాన్ని తీసుకువచ్చింది." అని ఎక్స్(ట్విట్టర్)లో కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు గుప్పించారు.
కాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ. అవన్నీ బాధ్యతరాహిత్య ఆరోపణలన్నారు. "తన విధి నిర్వహణలో భాగంగా అగ్నివీర్ అక్షయ్ లక్ష్మణ్ ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులకు ఆయన అర్హుడు. కాంట్రిబ్యూటరీ ఇన్సూరెన్స్ కింద రూ.48లక్షలు లక్ష్మణ్ కుటుంబానికి అందుతాయి. ఎక్స్గ్రేషియా కింద మరో రూ.44లక్షలు అందుతాయి. అదేవిధంగా ఇతర కాంట్రిబ్యూషన్ సైతం ఆయన కుటుంబం స్వీకరిస్తుంది." అని అమిత్ మాలవీయ అన్నారు. ప్రధాని పదవికి పోటీ చేసే వ్యక్తి.. ఇలాంటి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయకూడదని రాహుల్ ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యానించారు.