Rahul Gandhi On Adani :దేశంలో విద్యుత్తు బిల్లుల పెరుగుదలకు అదానీయే కారణమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యుత్తు బిల్లుల రూపంలో ఇప్పటివరకు రూ.12 వేల కోట్లు ప్రజల నుంచి దోచుకున్నారని విమర్శించారు. విదేశాల నుంచి కొనుగోలు చేసిన బొగ్గు ధరను రెట్టింపు చేయటం వల్ల.. విద్యుత్తు బిల్లులు పెరుగుతున్నాయని రాహుల్ పేర్కొన్నారు. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. బొగ్గు ధరల పెరుగుదలపై లండన్‌కు చెందిన ఫైనాన్సియల్ టైమ్స్‌లో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు.
"అదానీ ఇండోనేషియాలో బొగ్గు కొనుగోలు చేస్తారు. ఆ బొగ్గు భారత్ చేరేసరికి ధర రెట్టింపు అవుతుంది. ఈ విధంగా దాదాపు రూ.12 వేల కోట్లు దేశ ప్రజల నుంచి అదానీ దోచుకున్నారు. బొగ్గు రేటు పెంచటం వల్ల విద్యుత్తు బిల్లులు పెరుగుతున్నాయి. దీనికి కారణం అదానీ అని తేలింది. దేశ ప్రజలు ఇది అర్థం చేసుకోవాలి. మీ విద్యుత్తు బిల్లులు పెరుగుతున్నాయంటే అందుకు కారణం అదానీ. రూ.12 వేల కోట్లు మీ నుంచి అదానీ తీసుకున్నారు. ఈ మాట నేను మాత్రమే కాదు లండన్‌కు చెందిన ఫైనాన్సియల్ టైమ్స్ చెబుతోంది. ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఈ కథనంపై దేశంలోని ఒక్క మీడియా కూడా ప్రశ్నించదు."
--రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు