Rahul Gandhi Jeremy Corbyn meet: బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు, లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్‌ను కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కలవడం దేశంలో రాజకీయ దుమారానికి దారితీసింది. జెరెమీ గతంలో భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని, వాటికి రాహుల్ మద్దతిస్తున్నారా? అని భాజపా ప్రశ్నించింది. దీనికి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. గతంలో జెరెమీని మోదీ కలిసిన ఫొటోను షేర్ చేస్తూ.. అదే ప్రశ్నను భాజపాకు సంధించింది.
BJP on Rahul Gandhi Jeremy meet:లండన్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. సోమవారం జెరెమీని కలిశారు. భారతీయ ప్రవాస కాంగ్రెస్ ఈ ఫొటోను షేర్ చేసింది. 2015 నుంచి 2020 మధ్య బ్రిటన్ పార్లమెంట్లో విపక్ష నేతగా జెరెమీ పనిచేశారు. పలు విషయాల్లో భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన భాజపా సీనియర్ నేత, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు.. రాహుల్‌పై మండిపడ్డారు. సొంత దేశానికి వ్యతిరేకంగా ఎంతదూరం వెళ్లగలరని ప్రశ్నించారు. కశ్మీర్ వేర్పాటును ప్రోత్సహించే అతడిని రాహుల్ కలిశారని ధ్వజమెత్తారు. భాజపా నేత కపిల్ మిశ్ర సైతం రాహుల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక వ్యక్తిగా జెరెమీ కార్బిన్ సుపరిచితులు. ఇండియా నుంచి కశ్మీర్‌ను వేరు చేయాలని జెరెమీ బహిరంగంగా సూచించారు. ఆయనతో రాహుల్ గాంధీ లండన్‌లో ఏం చేస్తున్నారు?' అని ప్రశ్నించారు.
Rahul Gandhi BJP counter:కాగా, భాజపా ఆరోపణలను కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తిప్పికొట్టారు. పరస్పర విభిన్న భావజాలాలు ఉన్న రెండు దేశాల రాజకీయ నాయకులు గతంలోనూ కలుసుకున్నారని, భవిష్యత్‌లోనూ కలుసుకుంటారని అన్నారు. జెరెమీతో మోదీ సమావేశం కావడంపై ప్రశ్నలు సంధించారు. ఓ బహిరంగ సమావేశంలో మెహుల్ ఛోక్సీని సోదరుడిగా పిలుస్తూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించాలని మీడియాను కోరారు.
"కేంద్ర ప్రభుత్వం, కపిల్ మిశ్ర వంటి వ్యక్తుల మూర్ఖపు అజెండాను మోయడానికి టీవీ మీడియాలోని కొందరు మిత్రులు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. జెరెమీతో భేటీ అయినప్పుడు మోదీ ఏం చర్చించారని మీడియా మిత్రులు భాజపాను అడగాలి. జెరెమీ అభిప్రాయాలకు మోదీ మద్దతు పలికారా? భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్న నేతతో భేటీ కావడం తప్పు కాదు, నేరమూ కాదు. అలాగైతే, ప్రధాని మోదీ.. ఆర్థిక నేరస్థుడు నీరవ్ మోదీని దావోస్‌కు ఎందుకు తీసుకెళ్లారో మీడియా అడగాలి. వీరిద్దరి ఫొటోల గురించి ప్రశ్నించాలి. బహిరంగ సభలో మెహుల్ ఛోక్సీని 'మా సోదరుడు మెహుల్' అని సంబోధించిన వీడియో గురించి అడగాలి. చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకున్నప్పుడు జిన్‌పింగ్‌తో మోదీ ఎందుకు సమావేశమయ్యారు? అప్పటి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను కలిసేందుకు మోదీ పాకిస్థాన్ ఎందుకు వెళ్లారు? భిన్నమైన అభిప్రాయాలు ఉన్నవారిని కలవబోమని ప్రభుత్వం ఇప్పుడు హామీ ఇస్తుందా? అసలైన సమస్యలపై చర్చిద్దాం.. భాజపా దుష్ప్రచారాలపై కాదు."
-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రతినిధి