QS Asia University Rankings 2024 India :ఆసియా దేశాల్లోని విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ర్యాంకింగ్స్‌లో భారత్ అదరగొట్టింది. ప్రతిష్ఠాత్మక క్యూఎస్(క్వాకరెల్లి సైమండ్స్) సంస్థ 2024 ఏడాదికి గాను బుధవారం విడుదల చేసిన ర్యాంకుల్లో భారత్‌లోని టాప్ యూనివర్సిటీలు సత్తా చాటాయి. ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ అగ్రశ్రేణి-50 విశ్వవిద్యాలయాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ బాంబే 40వ ర్యాంకు, ఐఐటీ-దిల్లీ 46వ ర్యాంకులతో మెరిశాయి. మొత్తం 856 విశ్వవిద్యాలయాలతో కూడిన ఈ జాబితాలో.. భారత్ నుంచే అత్యధికంగా 148 విద్యా సంస్థలు ఉండటం విశేషం. దీంతో చైనా (133), జపాన్(96)లను భారత్ వెనక్కి నెట్టినట్లయ్యింది. ఇక ఈ ర్యాంకింగ్స్ జాబితాలో మయన్మార్, కంబోడియా, నేపాల్ తొలిసారిగా చోటు దక్కించుకున్నాయి.
కొత్తగా చేరిన 37 విద్యాసంస్థలు..
క్యూఎస్ ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌లో గతేడాది మాదిరిగానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- ఐఐఎస్‌సీ(బెంగళూరు), దిల్లీ విశ్వవిద్యాలయం, ఐఐటీ-బాంబే, దిల్లీ, మద్రాస్, ఖరగ్‌పుర్, కాన్పూర్ అగ్రశ్రేణి 100 విద్యా సంస్థల జాబితాలో నిలిచాయి. గతేడాది భారత్ నుంచి 111 వర్సిటీలు క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించుకోగా.. ఈసారి ఆ సంఖ్య 148కి చేరింది. కొత్తగా 37 విద్యా సంస్థలు చేరాయి. అదే సమయంలో చైనా నుంచి 133 వర్సిటీలు; జపాన్ నుంచి 96 విశ్వవిద్యాలయాలు మాత్రమే ఈ ర్యాంకింగ్స్ జాబితాలో ఉన్నాయి.
అయితే ఆయా విశ్వవిద్యాలయాల్లో అకడమిక్ కార్యకలాపాలు, పరిశోధన పత్రాల సమర్పణ, విద్యార్థి-ఆచార్యుల నిష్పత్తి, ఆచార్యుల సంఖ్య, వసతులు, విదేశీ విద్యార్థులు తదితర అంశాలను సమగ్రంగా విశ్లేషించి ఈ క్యూఎస్ ర్యాంకింగ్స్ జాబితాను రూపొందిస్తారు. ఇక ఈ లిస్ట్‌లో పెకింగ్ యూనివర్సిటీ ఆఫ్ చైనా మొదటి ర్యాంకుతో సత్తా చాటింది. యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ రెండో స్థానంలో, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ మూడో స్థానంలో నిలిచాయి. నాన్యాంగ్ టెక్నోలాజికల్ యూనివర్సిటీ(సింగపూర్), సింగువా యూనివర్సిటీ(చైనా) నాలుగైదు స్థానాల్లో ఉన్నాయి.