Punjab Congress CM Face: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో అధికారికంగా ప్రకటించే విషయమై కాంగ్రెస్ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. ప్రస్తుత సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారు. ఆయనను సమర్థించే వారి సంఖ్యా పెరుగుతోంది. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్దూ కంటే పంజాబ్ తొలి దళిత ముఖ్యమంత్రి చన్నీకే మద్దతిస్తున్నారు. తనను కాకుండా మరెవరినైనా అధికారికంగా ప్రకటిస్తే ఎన్నికల ముంగిట్లో సిద్దూ ఎలా ప్రవర్తిస్తారోననే భయం ఆ పార్టీని వెంటాడుతోంది. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న దళితులకు ప్రాతినిధ్యం వహిస్తున్న చరణ్‌జీత్‌ను కాదని మరో అభ్యర్థిని ప్రకటించే సాహసం చేయలేకపోతోంది. ఈ రెండింటి మధ్య కాంగ్రెస్ నాయకత్వం సతమతమౌతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలను సంయుక్త నాయకత్వం ఆధ్వర్యంలోనే ఎదుర్కొంటామని ప్రకటించింది.
ఆప్ విసిరిన సవాల్
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన పోటీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాన ప్రత్యర్థి అయిన ఆప్...లోక్‌సభ సభ్యుడైన భగవంత్‌మాన్‌ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి స్పష్టత ఇచ్చినందున కాంగ్రెస్ కూడా చన్నీ పేరును ప్రకటించాలని స్థానిక నేతలు కోరుతున్నారు.