Puducherry Minister Resigns : తనపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, అంతేకాకుండా కుల వివక్షకు గురవుతున్నానని ఆరోపిస్తూ ఏకంగా తన మంత్రి పదవికే రాజీనామా చేశారు పుదుచ్చేరి రవాణా శాఖ మంత్రి చంద్ర ప్రియాంక. తనకు ఎదురవుతున్న సవాళ్లు, కుల వివక్ష సహా లైంగిక వేధింపుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె వివరించారు. రాజీనామా పత్రాన్ని మంగళవారం పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామికి అందజేశారు చంద్ర ప్రియాంక.
41 ఏళ్ల పుదుచ్చేరి రాజకీయ చరిత్రలో ఇలా మహిళా మంత్రి లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ రాజీనామా చేయడం ఇదే తొలిసారి. కాగా, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి రెండవ మహిళా మంత్రిగా పనిచేశారు చంద్ర ప్రియాంక. ప్రస్తుతం ఆమె అఖిల NR కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
'నేను ఒక దళిత మంత్రిగా ఎంతో నిబద్ధతో పనిచేశాను. అయినప్పటికీ.. ఇతర వర్గాల నుంచి నా సామాజిక వర్గం విషయంలో వివక్షతను ఎదుర్కొన్నా. వివరంగా చెప్పాలంటే కుల వివక్షతో పాటు లైంగిక వేధింపులకు గురవుతున్నాను. ఇలాంటి వాతావరణంలో నేను ఇక మంత్రిగా కొనసాగలేను' అంటూ ముఖ్యమంత్రికి సమర్పించిన రాజీనామా లేఖలో చంద్ర ప్రియాంక ఆరోపించారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో మంత్రి చంద్ర ప్రియాంక.
మొదటి మహిళా మంత్రిగా ప్రియాంక!
చంద్ర ప్రియాంక.. పుదుచ్చేరిలో దళిత మహిళా నాయకురాలిగా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె తండ్రి చంద్రకాసు పుదుచ్చేరి మాజీ మంత్రిగా సేవలందించారు. ఆయనే ప్రియాంక రాజకీయ రంగ ప్రవేశానికి మార్గం సుగమం చేశారు. 2016లో నెడుంగడు నియోజకవర్గం నుంచి పుదుచ్చేరి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 8,560 ఓట్ల మెజార్టీతో రెండో సారి NR కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
2021లో జరిగిన పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో మొత్తం 30 స్థానాలకుగానూ ఎన్‌ఆర్ కాంగ్రెస్ 10 స్థానాల్లో గెలవగా.. బీజేపీ ఆరు చోట్ల విజయం సాధించింది. 2016 ఎన్నికల్లో 15 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్.. 2021 ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైపోయింది. ఇకపోతే డీఎంకే ఆరు చోట్ల విజయం సాధించగా.. స్వతంత్రులు ఆరుచోట్ల విజయం సాధించారు. ఎన్నికల బీజేపీ-ఎన్‌ఆర్ కాంగ్రెస్ కూటమి ప్రస్తుతం పుదుచ్చేరిలో అధికారంలో ఉంది.
Amartya Sen Death Fake News : 'అమర్త్యసేన్ క్షేమంగానే ఉన్నారు'.. క్లారిటీ ఇచ్చిన కుమార్తె
Brother Killed Brother In Meerut : ఆస్తి కోసం అన్నను చంపి 'దృశ్యం' రేంజ్ స్కెచ్.. ఇంతలోనే పోలీసులకు అడ్డంగా బుక్!