PUBG Addiction Student Death: మధ్యప్రదేశ్ ఇందోర్లోని తుకోగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ గేమ్ పబ్జీ నిండుప్రాణాన్ని బలి తీసుకుంది. పబ్జీ ఆటకు బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు ఓ విద్యార్థి. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఏమైందంటే?
తుకోగంజ్ వల్లభ్నగర్కు చెందిన ఓ యువకుడు 12వ తరగతి చదువుతున్నాడు. కన్నకొడుకు పబ్జీ ఆటకు బానిసవ్వడం సహించలేని తల్లిదండ్రులు అతడి నుంచి సెల్ఫోన్ లాక్కున్నారు. దీంతో తాను ఇక పబ్జీ ఆడలేనని మనస్తాపం చెందిన ఆ విద్యార్థి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకున్నాడు.
కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు ఇంట్లోకి వచ్చి చూడగా శవమై కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామాకు తరలించారు. మృతుడి సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీస్ అధికారి ఆర్కే సింగ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. కుటుంబసభ్యులు, బంధువులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం ఆధారంగా విచారణ చేపట్టామన్నారు.
ఇదీ చూడండి:రెండు తలలు, మూడు చేతులతో అరుదైన శిశువు జననం