త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బంగాల్ కీలకం. ఇప్పటికే అక్కడ ప్రచార పర్వం ఊపందుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌తో హోరాహోరీ పోరుకు సిద్ధమైంది భాజపా. తమ ఉనికిని చాటుకునేందుకు వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. ఎన్నికలకు ముందు చాలా వరకు అంశాలు 2016 పరిస్థితిని గుర్తుకుతెస్తున్నాయి. కానీ.. ఓ లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి, శాంతిభద్రతలు, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ఇతరత్రా అంశాలేవీ చర్చకు రావట్లేదు.
ఈ సాధారణ అంశాలు వెనక్కి వెళ్లిపోయిందనేందుకు పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఊహించని రీతిలో రాజకీయ నేతలు పార్టీలు మారడం ప్రధాన కారణం. ఇదే మిగతావాటి నుంచి దృష్టిని మళ్లించింది. ఇంకా.. సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడం ఎక్కువైంది. ఈ ప్రస్తుత పరిస్థితి.. 'రాజకీయ దివాలా'కు ఏ మాత్రం తీసిపోదని అభిప్రాయపడుతున్నారు విద్యావేత్తలు, రాజకీయ మేధావులు. ఇది తమకు ఆందోళన కలిగిస్తోందంటున్నారు.
రాజకీయ లోటు స్పష్టం..
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న స్థితి.. రాజకీయ నేతల సైద్ధాంతిక ఆలోచనా పరిజ్ఞానం లోటుకు నిదర్శనమని ప్రఖ్యాత విశ్లేషకులు, ప్రెసిడెన్సీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డా. అమోల్ కుమార్ ముఖోపాధ్యాయ్ అభిప్రాయపడుతున్నారు.
''ఏ ఒక్కరూ అర్థవంతమైన రాజకీయ చర్చలో పాల్గొనట్లేదు. ఏ ఒక్కరూ అభివృద్ధి గురించి మాట్లాడటం లేదు. ప్రతీ బహిరంగ సభా.. అస్పష్టమైన అబద్ధాలు, అబ్బురపరిచే నాటక ప్రదర్శనల నడుమ సాగుతోంది. ఈ నంబర్ల ఆట కలగూరగంపలా ఉంది.''
- డా. అమోల్ కుమార్, రాజకీయ విశ్లేషకులు
'పార్టీలు మారేది అందుకే..'
రాజకీయ నేతలు వేగంగా నిమిష నిమిషానికీ పార్టీలు మారే ధోరణిపైనా విరుచుకుపడ్డారు డా. ముఖోపాధ్యాయ్. దీనికి కారణం టికెట్లు నిరాకరించడమో, లేదా తాము పాల్పడిన ఆర్థిక మోసాలకు సంబంధించి శిక్ష నుంచి తప్పించుకోవడమో అయ్యుంటుందని అంటున్నారు.
ఇవీ చూడండి: బంగాల్ దంగల్: అస్థిత్వ పోరాటం- మతతత్వ రాజకీయం
''దినేశ్ త్రివేది, రాజీవ్ బందోపాధ్యాయ్, ప్రొబీర్ గోశల్ వంటి నేతలు మాత్రమే.. నైతికంగా, మనస్సాక్షిగా తృణమూల్‌ను వీడి భాజపాలో చేరారు. మిగతా వారు టికెట్లు ఇవ్వనందుకో, తాము చేసిన కుంభకోణాల నుంచి తప్పించుకునేందుకో శిబిరాల్ని మార్చారు. ఇది హాస్యాస్పదంగా ఉంది. అలాంటి నేతలు బంగాల్‌కు, బంగాలీ ప్రజలకు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగానూ చెడ్డ పేరు తెచ్చారు.''
- డా. అమోల్ కుమార్, రాజకీయ విశ్లేషకులు
'గ్లామర్ పనిచేయదు'
ప్రస్తుత బంగాల్ రాజకీయాల్లో 'గ్లామర్ మంత్రం'పైనా మాట్లాడారు అమోల్. చాలామంది ప్రజాప్రతినిధిగా తమ బాధ్యతను సరిగా నిర్వర్తించట్లేదని, నిర్లక్ష్యంగా ఉంటున్నారని విమర్శించారు.
ఇదీ చూడండి: బంగాల్ దంగల్‌తో 'టాలీవుడ్'లో చీలిక!
''భాజపా లోక్‌సభ సభ్యురాలు లాకెట్ ఛటర్జీ మినహా.. ఇటీవల ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సెలబ్రిటీలు ఎవ్వరూ తమ బాధ్యతను తీవ్రంగా పరిగణించడం లేదు. కొత్తగా ఆయా పార్టీల్లో చేరికైన సినీ రంగానికి చెందిన కొందరు ఈసారీ గెలవొచ్చు. కానీ.. వారు తమ కర్తవ్యాన్ని తీవ్రంగా పరిగణిస్తారనేది సందేహమే.''