వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు మరిన్ని టీకా ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వారికి సహాయం చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆర్థికపరంగాను, ముడి పదార్థాల సరఫరాలోనూ వారికి అండగా ఉంటున్నట్లు చెప్పారు. దేశంలో టీకా పంపిణీపై మోదీ సమీక్షా సమావేశం అనంతరం ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) పేర్కొంది.
వివిధ రాష్ట్రాల్లో టీకా వృథా సంఖ్య అధికంగా ఉన్నందున.. దాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మోదీ ఆదేశించారు. దేశంలో ఉన్న టీకా లభ్యత గురించి ఈ సమావేశంలో మోదీకి అధికారులు వివరించారు. టీకా ఉత్పత్తిని పెంచేందుకుగాను వివిధ వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలకు సహాయం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.