తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమిపై విమర్శలతో విరుచుకుపడ్డారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. సీఎం పళనిస్వామి తల్లినే అవమానించిన వారు అధికారంలోకి మహిళలను గౌరవిస్తారా? అని ప్రశ్నించారు. తమిళ ప్రజలు ఈ విషయాలను గమనిస్తున్నారని కాంగ్రెస్, డీఎంకే గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర మహిళలను అవమానిస్తే తమిళులు సహించరని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులో ధారాపురంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు మోదీ. పళనిస్వామి తల్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత ఏ రాజా పేరును ప్రస్తావించకుండా పరోక్ష విమర్శలు గుప్పించారు. కేంద్ర మాజీమంత్రిని ఉద్దేశించి 'కాలం చెల్లిన 2జీ మిసైల్' అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళ మహిళలే లక్ష్యంగా ఆ మిసైల్ పని చేస్తోందని దుయ్యబట్టారు.