Modi Bijnor Rally: ఉత్తర్ప్రదేశ్లో ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నకిలీ సమాజ్వాదీల హయాంలో అభివృద్ధి అనే నదీ ప్రవాహం ఆగిపోయిందని విమర్శించారు. సొంత, సన్నిహితుల ప్రయోజనాల కోసమే వారు పనిచేశారని, రాష్ట్ర అభివృద్దిని పట్టించుకోకుండా స్వార్థంగా వ్యవహరించారని ఆరోపించారు.
" రైతులకు, పశ్చిమ యూపీ ప్రజలందరికీ నేను ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నా. మిమ్మల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నవారిని ఓ విషయం అడగండి. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రాంతంలోని గ్రామాలకు ఎంత కరెంటు ఇచ్చారని ప్రశ్నించండి. కేంద్ర, రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వాలు రైతుల గౌరవాన్ని, హక్కులను తిరిగి తెస్తున్నాయి. గత ఐదేళ్లలో చెరకు రైతులకు రూ.1.5లక్షల కోట్లను ప్రభుత్వం చెల్లించింది. అంతకుముందు రెండు ప్రభుత్వాలు కలిపి చెల్లించిన మొత్తానికంటే ఇది అధికం. చౌదరి చరణ్ సింగ్ వారసులమని చెప్పుకునే వారే అభివృద్ధికి అడ్డుపడుతున్నారు."
-ప్రధాని మోదీ.
Modi Speech Today
25 ఏళ్ల తర్వాత భారత్కు స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుందని, ఆ సమయానికి యూపీ అభివృద్ధి విజయగాథల గురించి దేశం తెలుసుకునే స్థాయికి రాష్ట్రం చేరాలని ఆకాంక్షించారు మోదీ. ఆ దిశగా భాజపా ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తోందని పేర్కొన్నారు.