PM Modis Security Breach: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం వ్యవహారానికి సంబంధించి ఫిరోజ్‌పుర్ పోలీసులు 150 మంది గుర్తుతెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగించినందుకు జిల్లాలోని కుల్గరి పోలీస్ స్టేషన్లో వీరిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
నివేదిక..
మోదీ పర్యటనలో భద్రతా వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోంశాఖ ఓ బృందాన్ని ఫిరోజ్‌పుర్ పంపింది. వారు ఆ ప్రాంతాన్ని సందర్శించి సీనియర్ అధికారులతో చర్చించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పిన పంజాబ్ ప్రభుత్వం ఓ నివేదికను కూడా కేంద్ర బృందానికి సమర్పించింది.
ఇదీ జరిగింది..
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో గత బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఫిరోజ్‌పుర్ జిల్లాలో నిరసనకారులు రహదారిని దిగ్బంధించడం వల్ల.. ప్రధాని, ఆయన వాహనశ్రేణి 15-20 నిమిషాల పాటు పైవంతెనపై చిక్కుకుపోయింది. దీంతో ప్రధాని తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని దిల్లీకి తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. నాటకీయ పరిణామాల మధ్య ఫిరోజ్పుర్లో జరగాల్సిన సభ ఆకస్మికంగా రద్దు అయింది. పంజాబ్‌లో మోదీ అడుగుపెట్టినప్పటికీ.. సభకు హాజరు కాకుండానే తిరిగి ఆయన దిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే సభకు మోదీ హాజరు కాలేకపోయారని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ ఘటన దేశంలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది.
ఇదీ చదవండి:ప్రధాని భద్రత అందుకే అంత కట్టుదిట్టం! ఎస్పీజీ నిర్ణయమే అల్టిమేట్!!