దేశంలో చీతాల సందడి షురూ.. చూసేందుకు ఇప్పుడే రావొద్దన్న మోదీ! PM Modi Releases Cheetahs: అరుదైన వన్యప్రాణులైన చీతాలు భారత్‌కు వచ్చేశాయి. నమీబియాలోని విండ్‌హాక్ నుంచి తీసుకొచ్చిన చీతాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ గ్వాలియర్ సమీపంలోని కునో నేషనల్ పార్కులోకి విడిచిపెట్టారు. అనంతరం వాటిని కెమెరాలతో ఫొటోలు తీశారు. చిరుతలను భారతదేశానికి తిరిగి ప్రవేశపెట్టే కార్యక్రమంలో సహాయం చేసినందుకు నమీబియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ.
దశాబ్దాలుగా అంతరించిపోయిన చిరుతలను భారత్‌కు తిరిగి రప్పించేందుకు ఇప్పటివరకు సరైన ప్రయత్నాలు జరగలేదని ప్రధాని ఆరోపించారు. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా చీతాలను ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేలా చేస్తున్నట్లు మోదీ వివరించారు. 'మన ప్రయత్నాలను విఫలం కానీయొద్దు. ప్రజలు సంయమనం పాటించాలి. కునో నేషనల్ పార్క్‌లో ఉన్న చీతాలను చూసేందుకు కొద్ది నెలలు వేచిచూడాలి. ఈ చీతాలు అతిథులుగా ఇక్కడికి వచ్చాయి. ఈ ప్రాంతం వాటికి కొత్త. కునో పార్క్‌ను తమ నివాసంలా భావించేందుకు వాటికి కొద్ది నెలల సమయం పడుతుంది' అని మోదీ వివరించారు.
"ఇవాళ భారత్ భూభాగంపైకి చీతాలను తీసుకువచ్చాం. ఒక పెద్ద చీతా యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. మన శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి దక్షిణాఫ్రికా, నమీబియా నిపుణులతో కలిసి పనిచేశారు. మన బృందాలు అక్కడికి వెళ్లాయి. అక్కడి నిపుణులు భారత్ వచ్చారు. చీతాల నివాసానికి అనువైన ప్రదేశం కోసం దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు సర్వే నిర్వహించారు. తర్వాత కునో జాతీయపార్కును ఎంపిక చేశారు. రానున్న రోజుల్లో కునో నేషనల్ పార్కు పర్యాటక ప్రదేశంగా మారుతుంది."
--నరేంద్ర మోదీ, భారత ప్రధాని
చీతాలతో బయల్దేరిన ప్రత్యేక విమానం శనివారం ఉదయం మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ల్యాండ్ అయ్యింది. మహారాజ్‌పుర వైమానిక స్థావరంలో దిగిన ఈ చీతాలకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. అనంతరం ఈ చీతాలను భారత వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లలో కునో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చారు. చీతాలతో వచ్చిన బృందం చినూక్ హెలికాప్టర్‌లో పార్క్‌కు చేరుకుంది. వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా ఇప్పుడు నమీబియా నుంచి 8 చీతాలు తీసుకొచ్చారు. ఇందులో ఐదు ఆడ, మూడు మగ చీతాలున్నాయి.
దేశంలోకి 74 ఏళ్ల తర్వాత మళ్లీ చీతాలు ప్రవేశించాయి. 1948లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్ ప్రస్తుత ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలో చివరి చీతా చనిపోయిన తర్వాత దేశంలో వీటి ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. అందుకే వీటిని అంతరించిన జాతిగా 1952లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల సంరక్షకుల కృషి, కేంద్ర ప్రభుత్వ చొరవ ఫలితంగా ఇప్పుడు నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌లోకి వచ్చాయి. ప్రత్యేక బోయింగ్ విమానంలో 16 గంటలు ప్రయాణించి దేశంలో అడుగుపెట్టాయి.
ఈ చీతాల కోసం కునో నేషనల్ పార్కులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. వీటి ఆలనా పాలన చూసేందుకు సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. భారత్‌కు తరలించనున్న చీతాలకు ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తి చేసి ఐసోలేషన్‌లో ఉంచారు. ఆరోగ్యం, క్రూరత్వం, వేటాడే నైపుణ్యాలు, భవిష్యత్తులో వాటి సంతతిని పెంచగల జన్యుసామర్థ్యాలను పరిగణనలోకి తీసుకొని 8 చీతాలను భారత్ కోసం ఎంపిక చేశారు. కునో నేషనల్ పార్కులో వీటిని తొలుత 30 రోజులపాటు క్వారంటైన్ ఎన్‌క్లోజర్లలో ఉంచుతారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 7,500 చీతాలు ఉన్నట్లు అంచనా.
కునో నేషనల్ పార్కులో ప్రధాని 'ప్రధాని మోదీ చీతాల విడుదల ఓ తమాషా'
మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో ప్రధాని మోదీ.. చీతాలను విడిచిపెట్టడాన్ని ఓ తమాషాగా కాంగ్రెస్ అభివర్ణించింది. జాతీయ సమస్యలు., భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే మోదీ చీతాల అస్త్రాన్ని వాడారని పేర్కొంది. ప్రధాని మోదీ పాలనలో గత నిర్ణయాల కొనసాగింపును ఎన్నడూ గుర్తించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ విమర్శించారు. దానికి చీతా ప్రాజెక్టు ఓ ఉదాహరణ అని ఆరోపించారు. 2009 నుంచి 2011 మధ్య కాలంలో పర్యావరణ, అటవీశాఖ మంత్రిగా పనిచేసిన జైరాం రమేష్ 2010లో చీతా ప్రాజెక్టు నిమిత్తం కేప్‌టౌన్‌ను సందర్శించిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు. చీతాలను మొదటిసారిగా పన్నా, సరిస్కాకు తరలించినప్పుడు.. వాటి మనుగడపై సందేహాలు తలెత్తాయని గుర్తు చేశారు. కానీ అవన్నీ అవాస్తవమని జైరాం పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ చీతా ప్రాజెక్టుపైనా కొన్ని ఊహాగానాలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులో ఉన్నవారంతా మొదటి శ్రేణి నిపుణులు కావడం వల్ల భయపడాల్సిన పని లేదన్నారు.
ఇవీ చదవండి:ప్రేయసిపై 20 కత్తిపోట్లు.. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని..
'నా భర్త మగాడు కాదు'.. పెళ్లైన 8 ఏళ్లకు మహిళ ఫిర్యాదు