PM Modi on Christmas Eve :పేదలను ఆదుకోవడంలో క్రైస్తవ సమాజం ఎప్పుడూ ముందుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆరోగ్యం, విద్య తదితర రంగాల్లో క్రైస్తవులు స్వచ్ఛంద సంస్థలను నెలకొల్పి దేశానికి ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు. క్రైస్తవ వర్గానికి చెందిన ఎంతో మంది మేధావులు, నేతలు స్వాత్రంత్ర్య సమరంలో తమ వంతు పాత్ర పోషించారన్నారు. క్రిస్మస్ సందర్భంగా తన నివాసానికి వచ్చిన క్రైస్తవ సోదరులను కలిసిన ప్రధాని వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి ఫలాలు అందిరికీ చేరువ చేసేందుకు కేంద్రంలోని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. NDA పాలనలో క్రైస్తవులతోపాటు పేదలందరూ లబ్ధి పొందుతున్నారని వివరించారు. క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్‌లో సత్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్న మోదీ, సత్యం మాత్రమే మోక్షానికి దారి చూపిస్తుందన్నారు సమాజానికి సేవ, మానవాళిపై కరుణ అనేవి క్రీస్తు సందేశాలని పేర్కొన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఏసుక్రీస్తు జీవిత సందేశం, ఆయన ప్రతిపాదించిన విలువలను గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వ అభివృద్ధి ప్రయాణంలో ఆయన విలువలు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు
"క్రైస్తవ సమాజంతో నా సంబంధాలు చాలా ఏళ్ల నుంచి ఉన్నాయి. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తరచూ క్రైస్తవ సమాజంతో కలిసేవాడిని. పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తున్న వారిని దీవించాలని జీసస్‌ను కోరారు పోప్. ఆయన చెప్పిన పదాలు మా అభివృద్ధి మంత్రం ఒకేలా ఉంటాయి. సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ అనేది మా ప్రభుత్వ నినాదం. వీలైనంత వరకు పేదలకు, ప్రతి ఒక్కరికి తమ పథకాలు అందాలన్నదే మా ఉద్దేశం. ఫిట్ ఇండియా, మిల్లెట్స్, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాలను చేపట్టాలని క్రైసవ సమాజాన్ని కోరుతున్నాను. లోకల్ ఫర్ వోకల్ విధానానికి మద్దతుగా నిలవాలి."
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి