దేశవ్యాప్తంగా వేలాది మంది యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీపావళి కానుకలు అందించారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగం పొందిన 75 వేల మంది యువతకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే 'రోజ్గార్ మేళా'ను ప్రధాని మోదీ ప్రారంభించారు. గడిచిన 8ఏళ్లలో ఉద్యోగ, స్వయం ఉపాధి కల్పన విషయంలో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు కీలక మైలురాయిగా 'రోజ్గార్ మేళా' నిలిచిపోతుందని మోదీ ఉద్ఘాటించారు.
మోదీ దీపావళి గిఫ్ట్.. 70వేల మందికి నియామక పత్రాలు.. మరో 10లక్షల మందికి.. - మోదీ వార్తలు
వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలకు ఎంపికైన యువతకు నియామక పత్రాలు అందజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మరోవైపు, 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే రోజ్గార్ మేళాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కరోనా సమయంలో ఉద్యోగ సంక్షోభం తలెత్తకుండా తీసుకున్న జాగ్రత్తలను మోదీ వివరించారు. ఎంఎస్ఎంఈ రంగాలకు రూ.3లక్షల కోట్లకు మించి సహాయం చేసినట్లు తెలిపారు. తద్వారా 1.5 కోట్ల ఉద్యోగాలను కాపాడినట్లు స్పష్టం చేశారు. టూరిజం, తయారీ రంగాల్లో ఉపాధికి అనేక అవకాశాలు ఉన్నాయన్న మోదీ.. ఈ రంగాలను మరింత విస్తరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
"భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. గడిచిన ఎనిమిదేళ్లలో మనం పదో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎగబాకాం. చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వందేళ్లలో చూడని అతిపెద్ద సంక్షోభం తాలూకు ప్రభావం వంద రోజుల్లో తగ్గిపోదు. అయినప్పటికీ.. భారత్ సరికొత్త ప్రయత్నాలతో ముందుకెళ్తోంది. కొన్ని రిస్కులు తీసుకొని ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి తనను తాను రక్షించుకుంటోంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి