PM Modi in Hardoi: ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అహ్మదాబాద్ బాంబు దాడులను గుర్తు చేసుకున్నారు. అలాంటి దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల పట్ల కొన్ని పార్టీలు సానుభూతి చూపుతున్నాయని ఆరోపించారు. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన కొన్ని ఉగ్రదాడులకు కారణమైన వారిపై కేసులను కొట్టివేయాలని అప్పటి సమాజ్వాదీ పార్టీ ప్రయత్నించినట్లు చెప్పారు.
ఉత్తర్ప్రదేశ్, హర్దోయ్ నియోజకవర్గంలో నిర్వహించి బహిరంగ సభలో విపక్షాలపై నిప్పులు చెరిగారు మోదీ. నాటు తుపాకులను ఉపయోగించే వారిని సమాజ్వాదీ ప్రభుత్వం ఏ విధంగా స్వేచ్ఛగా తిరగనిచ్చిందో హర్దోయ్ ప్రజలు గమనించినట్లు చెప్పారు.
" 2014-17 వరకు ఈ కుటుంబ పాలకులు నాకు మద్దతు ఇవ్వకపోవటం చాలా బాధగా అనిపించింది. నేను యూపీ నుంచి ఎంపీని, కానీ 2017 వరకు అప్పటి ప్రభుత్వం ప్రజల కోసం పని చేసేందుకు అనుమతించలేదు. వారిని మరోమారు అధికారంలోకి తీసుకొస్తే.. మీకోసం నన్ను పని చేయనిస్తారా? అలాంటి వారు మళ్లీ ఎన్నికవటం అవసరమా? అలాంటి కుటుంబ పాలకులు కులం పేరుతో విషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. అలాంటి వారు కూర్చీ కోసం సొంత కుటుంబంతోనే గొడవపడతారు. మీరు ఓటు వేసి గెలిపించే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏ కుటుంబానికి చెందినది కాదు. మన ప్రభుత్వం పేదలు, రైతులు, యువత కోసం ఏర్పడింది."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.