జమ్ము కశ్మీర్‌కు చెందిన 14 మంది నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం నిర్వహించిన భేటీ ముగిసింది. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్‌లోన్, గులాం నబీ ఆజాద్, యూసుఫ్ తరిగామి సహా తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడి నేతలతో ప్రధాని సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్ షా సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించడం, ప్రత్యేక హోదా రద్దును వెనక్కి తీసుకోవడం అనే అంశాలను గుప్కార్ కూటమి ఈ సమావేశంలో ప్రధానంగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.