PM Modi Election Campaign in Telangana Today :పదేళ్లుగా తెలంగాణకు బీఆర్‌ఎస్ చేసింది ఏమీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) విమర్శలు చేశారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని అన్నారు. ఈ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టబోతోందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నిర్మల్ నియోజకవర్గంలో జరిగిన బీజేపీ సకల జనుల సంకల్ప సభ(BJP Public Meeting)లో పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ధరణి ద్వారా భూ మాఫియాకు పాల్పడుతోందని పీఎం మోదీ ఆరోపణలు చేశారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు. కేసీఆర్ తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తారని.. కేవలం ఫామ్‌హౌజ్‌కు పరిమితమయ్యారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ప్రజలను కలవని సీఎం మనకు అవసరమా.. సచివాలయానికి వెళ్లని సీఎం అవసరమా అంటూ ప్రశ్నించారు. సర్కార్ స్టీరింగ్‌ను కేసీఆర్ వేరే పార్టీ చేతుల్లో పెట్టారని.. ఇలా ప్రజలను కలవని ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు అవసరమా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలాంటి ప్రజలను కలవని సీఎంను ఇంటికి పంపాలా.. వద్దా అంటూ నిర్మల్ సభ(Nirmal Sabha)కు విచ్చేసిన సభికులను ఉద్దేశించి ప్రసంగించారు.
BJP Public Meeting at Nirmal in Telangana :సచివాలయానికి వెళ్లని సీఎం మనకు కావాలా అంటూ తెలుగులో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పదేళ్లలో 4 కోట్ల పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించామని అన్నారు. తెలంగాణ పేదలకు కేసీఆర్ చేసిందేమీ లేదు.. కేసీఆర్ సర్కార్ పేదల వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపణలు చేశారు. కానీ తెలంగాణ ప్రజల గురించి బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. ఇక్కడి పేదలకు ఇళ్లు నిర్మించకుండా బీఆర్‌ఎస్(BRS) అడ్డుకుంటోందని పేర్కొన్నారు. పసుపు రైతుల కోసం తెలంగాణలో పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటు చేశామన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే నిజామాబాద్‌ను పసుపు నగరంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆర్మూర్ పసుపు పంటకు జీఐ ట్యాగ్ వచ్చేలా కృషి చేస్తామని మాటిచ్చారు.