భారత్ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకొంటున్న తరుణంలో ప్రజలు విదేశీ వస్తువుల బానిసత్వం నుంచి బయటపడాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మహారాష్ట్ర, పుణెలోని జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్-(జేఐటీఓ)ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం 'జీటో కనెక్ట్-2022' బిజినెస్ మీట్లో మాట్లాడారు. 'ఓకల్ ఫర్ లోకల్' మంత్రాన్ని అవలంబించాలని, విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు.
" విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని మనం తగ్గించాలి. ఎగుమతులకు కొత్త గమ్యాలను కనుక్కోవాలి. స్థానిక మార్కెట్లలోనూ దీనిపై అవగాహన కల్పించాలి. నాణ్యమైన, పర్యావరణహితమైన స్థానిక ఉత్పత్తుల కోసం జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్ అనే సూత్రం ఆధారంగా మనం పనిచేయాలి. ప్రస్తుతం టాలెంట్, ట్రేడ్, టెక్నాలజీని దేశం ప్రోత్సహిస్తోంది. దేశంలో ప్రతిరోజు డజన్ల కొద్దీ స్టార్టప్స్ నమోదవుతున్నాయి. ప్రతివారం ఒక యునికార్న్ సంస్థ ఆవిర్భవిస్తోంది. ఆత్మనిర్భర భారత్ మన మార్గం, మన సంకల్పం"
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.