భారతీయ భాషల్లో సాంకేతిక విద్యను బోధించే వాతావరణాన్ని అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచస్థాయి ప్రఖ్యాత జర్నల్స్‌ను కూడా మన భాషల్లోకి అనువదించాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల డైరెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. సాంకేతిక విద్యను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సరికొత్త విధానాలను రూపొందించాలని వారిని కోరారు.
'పర్యావరణ మార్పులు, కొత్త సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఉన్నత, సాంకేతిక విద్యలో మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరముంది. ఇందుకు సంస్థలు ఎప్పటికప్పుడు నూతనంగా తయారై, తమ పరిస్థితులను పునఃమూల్యాంకనం చేసుకోవాలి. అందరికీ సమాన స్థాయిలో నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చూడటమే విద్యావిధానం మూలమంత్రం కావాలి. కొన్నేళ్లుగా ఉన్నత విద్యారంగంలో నమోదవుతున్న వారి సంఖ్య మెరుగుపడటం అభినందనీయం. ఉన్నత విద్యను డిజిటలీకరిస్తే ఈ నిష్పత్తి మరింత పెరుగుతుంది. కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్), స్మార్ట్ వేరబుల్స్, ఆగ్‌మెంటెడ్ రియాలిటీ సిస్టమ్స్, డిజిటల్ అసిస్టెంట్స్ సాంకేతికతను సామాన్యులకూ అందుబాటులోకి తేవాలి. వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టు కృత్రిమ మేధ ఆధార విద్యా విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడంపై దృష్టి సారించాలి' అని ప్రధాని సూచించారు.