తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సి రావడం.. గత పాలకుల వల్లే'

PM Modi blames previous govts: వైద్యవిద్య కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి గత పాలకులే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. గతంలో వైద్య విద్య విధానాలు సరిగ్గా ఉండి ఉంటే.. విద్యార్థులు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. తమ ప్రభుత్వం ఈ తప్పులను సరిదిద్దుతోందని చెప్పారు.

PM UKRAINE STUDENTS
PM UKRAINE STUDENTS

By

Published : Mar 3, 2022, 9:58 PM IST

Updated : Mar 3, 2022, 11:42 PM IST

PM Modi blames previous govts: వైద్య విద్య కోసం పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లే పరిస్థితి గత ప్రభుత్వాల వల్లే తలెత్తిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. తమ సర్కారు దేశంలో వైద్య కళాశాలల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తోందని చెప్పుకొచ్చారు. తద్వారా విద్యార్థులు దేశంలోనే చదువుకోవచ్చని అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం యూపీకి వచ్చిన ఆయన.. ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన పలువురు విద్యార్థులతో ముచ్చటించారు. ఉక్రెయిన్​లో ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులకు, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Indian students medical education

"ఇలాంటి సంక్షోభ సమయంలో వారికి (విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు) కోపం రావడం సహజం. ఈ కార్యక్రమం(ఆపరేషన్ గంగ) ఏ స్థాయిలో చేపట్టామనే విషయాన్ని వారు అర్థం చేసుకుంటే.. వారే స్వయంగా మాపై ఆప్యాయత చూపిస్తారు. చాలా మంది విద్యార్థులు ప్రభుత్వం చేసిన పనికి హర్షం వ్యక్తం చేశారు. అన్ని ఆశలు కోల్పోయిన సమయంలో కాపాడినందుకు ధన్యవాదాలు చెబుతున్నారు. బలమైన ఇండియా తయారు కావడమే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం. వైద్యవిద్యా విధానాలు గతంలో సరిగ్గా ఉండి ఉంటే.. మీరు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఇంత చిన్న వయసులో తమ పిల్లలు దూరంగా వెళ్లి చదువుకోవాలని ఏ తల్లిదండ్రులూ కోరుకోరు. మా ప్రభుత్వం గత పాలకుల తప్పులను సరిదిద్దేందుకు పని చేస్తోంది."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

గతంలో దేశంలో 300-400 మెడికల్ కళాశాలలు ఉండేవన్న మోదీ.. ప్రస్తుతం 700కు పెరిగాయని చెప్పారు. వైద్య విద్య సీట్ల సంఖ్య 80-90 వేల నుంచి 1.5 లక్షలకు పెరిగిందని వివరించారు. ప్రతి జిల్లాకు ఓ వైద్య కళాశాల ఉండాలనేది తన ఆశయమని అన్నారు. గడిచిన 70 ఏళ్లలో దేశంలో తయారైన వైద్యుల కంటే.. వచ్చే పదేళ్లలో ఎక్కువ మంది డాక్టర్లు తయారవుతారని చెప్పారు.

ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ అనుభవాలను మోదీతో పంచుకున్నారు. రష్యా ఉక్రెయిన్​పై దాడి చేసినప్పుడు అన్ని ఆశలు కోల్పోయామని చెప్పారు. ప్రభుత్వ సహకారం లేకుంటే అక్కడి నుంచి బయటపడేవారిమి కాదని తెలిపారు. తాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని, ఉక్రెయిన్​లోని భారత ఎంబసీ తమ కోసం అన్ని ఏర్పాట్లు చేసిందని విద్యార్థులు చెప్పారు. మరో విద్యార్థి.. తన కుటుంబ సభ్యుల తరఫున మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మోదీ భగవంతుడిగా తమకు గుర్తుండిపోతారని చెప్పుకొచ్చారు.

ఆపరేషన్ గంగ వేగవంతం...

రష్యా దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సూచన మేరకు 18 వేల మంది భారత పౌరులు ఉక్రెయిన్​ను వీడారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఉక్రెయిన్​లోని భారత పౌరుల తరలింపు ప్రక్రియ మరింత వేగవంతం అయిందని చెప్పారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 15 విమానాల్లో మూడు వేల మంది భారతీయులు ఇండియాకు చేరుకున్నారని తెలిపారు. వచ్చే 24 గంటల్లో మరో 18 విమానాలు భారత్​కు రానున్నాయని చెప్పారు. బుధవారం అడ్వైజరీ విడుదల చేసిన తర్వాత ఖార్కివ్​లోని వెయ్యి మంది భారతీయులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారని స్పష్టం చేశారు. వీరందరిని అక్కడి నుంచి పశ్చిమ లేదా దక్షిణ ఉక్రెయిన్​కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.

టీకాలు తీసుకోండి..

ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన పౌరులందరూ కొవిడ్ టీకాలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. టీకా తీసుకోని వారెవరైనా ఉంటే వెంటనే వేయించుకోవాలని తెలిపింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చే పౌరుల కోసం అంతర్జాతీయ ప్రయాణ మార్గదర్శకాలను సవరించామని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. దేశానికి వచ్చిన వారి సమాచారాన్ని విదేశాంగ శాఖ నుంచి సేకరిస్తున్నామని తెలిపారు.

'ఖర్కివ్‌లోని భారతీయులారా.. అత్యవసరంగా ఈ దరఖాస్తు నింపండి'

రష్యా వరుస దాడులతో ఉక్రెయిన్‌లోని ఖర్కివ్‌ అట్టుడుకున్నవేళ.. ఆ నగరంలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులకు స్థానిక భారత రాయబార కార్యాలయం అత్యవసర ప్రాతిపదికన ఓ దరఖాస్తు నింపాలంటూ సూచించింది. పిసొచిన్‌ మినహా ఖర్కివ్‌లో ఉన్న భారతీయ పౌరులందరూ.. ఆ దరఖాస్తులో వివరాలను నింపాలంటూ తాజాగా ఓ ట్వీట్‌ చేసింది.

భారతీయుల కోసం రష్యా బస్సులు..

ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారత పౌరులను తరలించేందుకు 130 బస్సులను సిద్ధం చేసినట్లు రష్యా తెలిపింది. ఖార్కోవ్, సుమీ నగరాల్లోని ఇతర దేశాల పౌరులను తరలిస్తున్నట్లు తెలిపింది. రష్యాలోని బెలగోరోడ్ ప్రాంతానికి వీరిని చేర్చుతున్నట్లు ఆ దేశ సైనిక జనరల్ వెల్లడించారు.

ఇదీ చదవండి:యుద్ధంపై భారత్ తటస్థత ఎందుకు? రష్యాతో మైత్రికి కారణమేంటి?

Last Updated : Mar 3, 2022, 11:42 PM IST

ABOUT THE AUTHOR

...view details