PFI Hartal in Kerala: పీఎఫ్ఐ జాతీయ, రాష్ట్ర నేతలను ఎన్ఐఏ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ హర్తాళ్‌కు పిలుపునిచ్చారు ఆ సంస్థ మద్దతుదారులు. అయితే ఈ హర్తాళ్ వల్ల పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తిరువనంతపురంలో ఆటో, కారుపై ఆందోళనకారులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ రెండు వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. కొల్లాంలో ఇద్దరు పీఎఫ్ఐ కార్యకర్తలు బైక్‌పై వచ్చి ఇద్దరు పోలీసులపై దాడి చేశారు. హర్తాళ్‌కు పీఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సమ్మె నిర్వహిస్తామని పీఎఫ్ఐ నాయకులు తెలిపారు. ఈ హర్తాళ్ నుంచి అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇస్తున్నామని చెప్పారు. కేరళ ఆర్టీసీ బస్సులను కట్టక్కాడ వద్ద పీఎఫ్ఐ మద్దతుదారులు నిలిపివేశారు. మరికొన్ని చోట్ల సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నాయి. కేరళ, కన్నూర్, కాలికట్, ఎంజీ యూనివర్సిటీలు.. ఈ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశాయి.
తిరువనంతపురం, కొల్లాం, కోజికోడ్, వయనాడ్, అలప్పుజ సహా పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. కన్నూర్‌లోని నారాయణ్‌పరా వద్ద ఉదయం వార్తాపత్రికలను పంపిణీ చేయడానికి వెళ్తున్న వాహనంపై ఆందోళకారులు పెట్రోల్ బాంబు విసిరినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కోజీకోడ్‌లో 15 ఏళ్ల బాలికకు, కన్నూర్‌లో ఓ ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గురువారం ఎన్ఐఏ అరెస్టు చేసిన వారిలో పీఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ బషీర్, జాతీయ ఛైర్మన్ సలాం, జాతీయ కార్యదర్శి నసరుద్దీన్ ఎలమారం, మాజీ ఛైర్మన్ అబూబాకర్ తదితరులున్నారు.
భాజపా కార్యాలయంపై దాడి..
పీఎఫ్ఐపై ఎన్ఐఏ దాడులు జరిగిన కొన్ని గంటల్లోనే తమిళనాడు.. కోయంబత్తూరులోని భాజపా కార్యాలయంపై పెట్రోల్ బాంబు విసిరారు దుండగులు. గురువారం రాత్రి జరిగిందీ ఘటన. దీంతో కోయంబత్తూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని భాజపా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ దాడిని ఉగ్రదాడిగా అభివర్ణించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.