భారత్‌లో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు (Omicron cases in India) నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు తెలిపారు. కొవిడ్‌పై ఏర్పాటు చేసిన కన్సార్షియం ఇన్సాకాగ్(Omicron virus India).. పరిస్థితిని దగ్గరుండి పరిశీలిస్తోందని తెలిపారు. కరోనా పాజిటివ్‌గా తేలిన అంతర్జాతీయ ప్రయాణికుల నమూనాలకు జీనోమ్ విశ్లేషణ చేపడుతున్నట్లు వివరించారు.
అయినా ఆందోళనే..
ఒమిక్రాన్ నిర్ధరణ కాకపోయినప్పటికీ.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారిలో (Bengaluru omicron virus) కరోనా ఉన్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి నమూనా.. డెల్టా కంటే భిన్నమైన వేరియంట్ కలిగి ఉందని కర్ణాటక వైద్య శాఖ మంత్రి డాక్టర్ కే. సుధాకర్ వెల్లడించారు. ఈ విషయంపై ఐసీఎంఆర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
"డెల్టా వేరియంట్ గత తొమ్మిది నెలల నుంచి ఉంది. బాధితుడు భిన్నమైన వేరియంట్ బారిన పడ్డట్లు రిపోర్టులో తేలింది. అది డెల్టాకు భిన్నంగా ఉంది. ఈ నమూనాను ఒమిక్రాన్ అని అంటారా? దాని గురించి నేను అధికారికంగా ఏమీ చెప్పలేను. ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చిస్తున్నాం. నమూనాను ఐసీఎంఆర్‌కు పంపించాం."
-సుధాకర్, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి
డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ అంత ప్రమాదకరమేమీ కాదని దక్షిణాఫ్రికాలో ఉండే తన క్లాస్మేట్, డాక్టర్ వెల్లడించారని సుధాకర్ తెలిపారు. వేగంగా వ్యాప్తి చెందడం మాత్రం నిజమేనని అన్నారు. బాధితులకు వాంతులు, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. ప్రభావం అధికంగా ఉండదు కాబట్టి.. ఆస్పత్రిలో చికిత్స పొందాల్సిన అవసరం కూడా ఉండదన్నారు.