జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా మాత్రమే తాము కోరడంలేదని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. 2019 ఆగస్టు ముందు నాటి పరిస్థితులను కల్పించాలని డిమాండ్ చేశారు.
"మేము జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా అడగటంలేదు. 2019 ఆగస్టు 5కు ముందు నాటి పరిస్థితులను నెలకొల్పాలని డిమాండ్ చేస్తున్నాం. దేనికోసమైతే వేల మంది యువత త్యాగాలు చేశారో, లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయో, కోట్ల రూపాయులు వెచ్చించారో.. ఆ కశ్మీర్ అంశం పరిష్కారం కోరుతున్నాం. దానికోసం పాకిస్థాన్, జమ్ముకశ్మీర్ ప్రజలతో కేంద్రం చర్చించాలి."
- మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత్రి
నేషనల్ కాన్ఫరెన్స్ నేత హిలాల్ లోన్ అరెస్టుపై స్పందిస్తూ.. 'దేశంలో జంగిల్ రాజ్ (ఆటవిక పాలన) నడుస్తోంది. కశ్మీర్లో దాని తీవ్రత ఎక్కువగా ఉంది. కశ్మీర్ సహ దేశ ప్రజలపై భాజపా సర్కారు క్రూరంగా వ్యవరిస్తోంది. వారి దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రతిఘటించే వారిని ఏం చేస్తుందో చూస్తునే ఉన్నాం. బెంగళూరులో 21 ఏళ్ల యువతిని అరెస్టు చేశారు. రైతులతో ఎలా వ్యవహరిస్తున్నారో మనకు తెలుసు.' అని ముఫ్తీ అన్నారు.
కశ్మీర్ ప్రజల ఆకాంక్షల కోసమే గుప్కార్ కూటమి పనిచేస్తుందని, వారు కోరుకున్నానాళ్లు కూటమి కొనసాగుతుందని ముఫ్తీ స్పష్టంచేశారు. ఆర్టికల్ 370 రద్దు సమయంలో నిర్బంధించిన మాజీ ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్ సహా రాజకీయ ఖైదీలు, యువతను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:కశ్మీర్లో విదేశీ రాయబారుల పర్యటన