కరోనా మహమ్మారి.. రెండేళ్ల పాటు ప్రపంచాన్ని శాసించింది. వైరస్ దెబ్బకు దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. లాక్డౌన్ నేపథ్యంలో మన దేశంలో కూడా అనేక రైళ్లను నిలిపివేశారు రైల్వే అధికారులు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక్కో రైలును ప్రారంభిస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే కొన్ని నెలల పాటు నిలిచిపోయిన ముంబయి నుంచి నాసిక్ వెళ్లే పంచవటి రైలు తాజాగా ప్రారంభమైంది.
అయితే ఈ రైలులోని ఏసీ బోగీలో ప్రయాణం.. ప్యాసింజర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల.. ఏసీ బోగీలో నీరు లీకై ప్రయాణికుల మీద పడుతోంది. దీంతో గత్యంతరం లేక గొడుగులు వేసుకుని ప్రయాణిస్తున్నారు ప్యాసింజర్లు. ఈ క్రమంలో కొందరు.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రైల్వేశాఖను నిలదీస్తున్నారు. రూ.4 వేలు పెట్టి టికెట్లు కొని ప్రయాణం చేస్తుంటే కనీస సౌకర్యం కల్పించకపోవడంపై మండిపడుతున్నారు. వెంటనే మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.