తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆక్సిజన్​ ఉత్పత్తిపై గతంలోనే కేంద్రానికి హెచ్చరిక!

ప్రాణవాయువు ఉత్పత్తి పెంచాలని, భారీ స్థాయిలో నిల్వ చేయాలని కేంద్రానికి నవంబర్​లోనే సూచనలు ఇచ్చింది పార్లమెంటరీ స్థాయీ సంఘం. ఆక్సిజన్ కొరత వల్ల ఏర్పడే ఇబ్బందుల గురించి గతంలోనే హెచ్చరించింది.

oxygen shortage
ఆక్సిజన్, ప్రాణవాయువు కొరత

By

Published : Apr 25, 2021, 8:00 AM IST

ఆక్సిజన్‌ కొరత వల్ల కొవిడ్‌ రోగులకు చికిత్స అందించడంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి పార్లమెంటరీ స్థాయీ సంఘం నవంబరులోనే కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అన్ని కొవిడ్‌ ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్‌ అందుబాటులో ఉండాలని సూచించింది. బిహార్‌ రాజధాని పట్నాలోని ఎయిమ్స్‌ వద్ద రోగులు ఆక్సిజన్‌ సిలిండర్లు పట్టుకొని పడకల కోసం పరుగులు తీయడం మానవత్వాన్ని ముక్కలు చేసిందని ఆనాడే స్థాయీ సంఘం ఘాటుగా పేర్కొంది. వైద్య ఆరోగ్య వ్యవస్థ బలహీనతకు ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయని, అందువల్ల తక్షణం ప్రజారోగ్య వ్యవస్థకు కేటాయింపులు పెంచి దేశవ్యాప్తంగా ఉన్న వైద్య ఆరోగ్య సేవలు, సౌకర్యాలను వికేంద్రీకరించడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. కొవిడ్‌ వచ్చిన తర్వాత ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున ఆక్సిజన్‌ వినియోగం పెరిగినట్లు స్థాయీసంఘం వెల్లడించింది.

గత ఏడాది దేశంలో ప్రతిరోజూ 6,900 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుండగా, సెప్టెంబర్‌ మధ్యనాటికి దాని వినియోగం తారస్థాయికి చేరినట్లు పేర్కొంది. సెప్టెంబర్‌ 24, 25 తేదీల్లో ఒక్కోరోజు 3వేల టన్నుల వరకు ఆక్సిజన్‌ వినియోగం జరిగినట్లు పేర్కొంది. కొవిడ్‌కు ముందు రోజుల్లో మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరం రోజుకు వెయ్యి టన్నులకు పరిమితం కాగా, మిగిలిన 5,900 మెట్రిక్‌ టన్నులు పారిశ్రామిక అవసరాలకు వెళ్లేదని స్థాయీ సంఘం గుర్తుచేసింది.

చర్యలు తీసుకోవాలని ఆదేశం

ఆక్సిజన్‌ సిలిండర్ల ధరలపై పరిమితి విధించడంతోపాటు, అన్ని ఆసుపత్రుల్లో వైద్య అవసరాలకోసం కచ్చితంగా అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని 'జాతీయ ఔషధ ధరల నిర్ణాయక సంస్థ'ను స్థాయీ సంఘం ఆదేశించింది. డిమాండ్‌కు తగ్గట్టు ప్రాణవాయువును సరఫరా చేయడానికి వీలుగా దాని ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని కూడా సిఫార్సు చేసింది. తీవ్రత అధికంగా ఉన్న రోగులకే కాకుండా మధ్యస్థాయి రోగులకూ ఆక్సిజన్‌ చికిత్స అవసరం అవుతుందని స్థాయీసంఘం తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికలో పేర్కొన్న లెక్కలకు, ఇప్పటికీ పెద్ద తేడా కనిపించలేదు. ఈనెల 21న జరిగిన విలేకర్ల సమావేశంలో కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ చెప్పినదాని ప్రకారం దేశంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి 7,500 మెట్రిక్‌ టన్నులే. అందులో 6,600 మెట్రిక్‌ టన్నులు వైద్య అవసరాల కోసం రాష్ట్రాలకు కేటాయించారు. ఇదివరకూ అత్యధిక భాగాన్ని పారిశ్రామిక అవసరాలనుంచి వైద్య అవసరాలకు తరలించగా, ఇప్పుడూ అదే పనిచేశారు. గతేడాదికి, ఇప్పటికి 600 మెట్రిక్‌ టన్నులే ఉత్పత్తి పెరిగింది.

కేసులు పెరిగినా ఉత్పత్తి పెంచలేదు

గత సెప్టెంబర్‌లో పతాకస్థాయిలో నమోదైన కేసులతో పోలిస్తే ఇప్పటి రోజువారీ కేసులు దాదాపు 226% పెరిగాయి. అదే నిష్పత్తిలో ఆక్సిజన్‌ లభ్యతా పెరగాల్సి ఉండింది. కానీ ఆ పని చేయకపోవడంతో ఇప్పుడు పరిశ్రమలకు బంద్‌ చేసి వైద్య అవసరాలకోసం తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో తగిన మొత్తంలో ఆక్సిజన్‌ నిల్వలు ఉంచుకోవాలని స్థాయీ సంఘం గత ఏడాది నవంబర్‌లో ఇచ్చిన నివేదికలోనే చెప్పినప్పటికీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 9,294 టన్నులను విదేశాలకు ఎగుమతి చేసినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది నవంబర్‌ నాటికి కేసులు తగ్గిపోవడంతో కరోనా నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం మంచి పనితీరు కనబరిచినట్లు స్థాయీసంఘం ప్రశంసించింది. ఆ ప్రశంసనే ప్రధానంగా చూపుతూ ప్రచారం చేశారు తప్పితే అందులో చేసిన హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదు. దానివల్లే ఇప్పుడు ఆక్సిజన్‌లేక ఆసుపత్రుల్లో రోగులు మరణించాల్సి వస్తోందని వైద్యులు ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చదవండి:మహిళలూ.. అది ఫేక్‌న్యూస్‌!

ABOUT THE AUTHOR

...view details