బంగాల్లో శాసనసభ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదని ఆరోపించింది తృణమూల్ కాంగ్రెస్. టీఎంసీ ఎంపీల బృందం దిల్లీలో ఈసీ అధికారుల్ని కలిసి.. ఈమేరకు నిరసన తెలిపింది.
"బంగాల్లో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్రం విషయంలో ఈసీ అవలంబిస్తున్న పక్షపాత వైఖరితోనే ఇది స్పష్టమవుతోంది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో రాష్ట్ర పోలీసులను అనుమతించరాదని, కేంద్ర బలగాలను మాత్రమే మోహరించాలని ఈసీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే... చరిత్రలో ఎన్నడూలేని నిర్ణయం అవుతుంది. రాష్ట్ర పోలీసుల ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర పోలీసులకు సహకరించేందుకు మాత్రమే కేంద్ర బలగాలను ఉపయోగించాలి. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో కేంద్ర, రాష్ట్ర బలగాలను మోహరించాలి." అని ఈసీకి సమర్పించిన లేఖలో పేర్కొంది టీఎంసీ.