Parliament Security Breach Master Mind :పార్లమెంట్‌లో బుధవారం దుండగులు సృష్టించిన అలజడి యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ ఘటనపై దిల్లీ పోలీసులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అయిదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు- విచారణలో కీలక విషయాలు రాబట్టారు. లోక్‌సభలోకి దూకి కలకలం రేపిన మనోరంజన్ అనే వ్యక్తే ఈ ఘటన మొత్తానికి మాస్టర్ మైండ్ అని పోలీసులు తెలిపారు.
Parliament Security Breach Manoranjan :లోక్‌సభలో కలకలం రేపిన ఘటనలో మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్, అమోల్ శిందె, విశాల్, లలిత్ అనే ఆరుగురు నిందితులని పోలీసులు తెలిపారు. ఇందులో మనోరంజన్, సాగర్‌శర్మ లోక్‌సభలోకి చొరబడగా- నీలమ్, అమోల్ శిందే పార్లమెంట్ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి సహకరించిన విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా లలిత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
కర్ణాటకలోని మైసూరుకు చెందిన మనోరంజన్ ఒక ఎంపీ నుంచి పార్లమెంటులో ప్రవేశానికి పాస్ తీసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. సాగర్ శర్మను తన స్నేహితుడిగా పేర్కొంటూ అతడికీ పాస్ ఇప్పించాడు. అతడి పిలుపుతోనే మిగతా వారు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగిన బడ్జెట్ సమావేశాల సమయంలో మనోరంజన్ పార్లమెంట్ వద్ద రెక్కీ నిర్వహించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మనోరంజన్ తీరు నక్సల్స్ భావజాలంతో పోలి ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, ప్రధాన కుట్రదారుడు ఇంకెవరో ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.