Pakistan Woman Pubg Noida : పబ్జీ గేమ్‌లో పరిచయమైన ప్రేమికుడి కోసం దేశాలు దాటుకుని వచ్చింది పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళ. నలుగురు పిల్లలతో కలిసి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి ఇక్కడే కాపురం పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో జరిగింది.
ఇదీ జరిగింది
పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళకు.. పబ్జీ గేమ్ ఆడుతుండగా నోయిడాకు చెందిన సచిన్‌తో పరిచయమైంది. అనంతరం వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. తర్వాత వీరిద్దరూ ఒక చోట కలుసుకోవాలని భావించారు. అందుకోసం నేపాల్ కాఠ్మాండులోని ఓ హోటల్లో కలుసుకుని.. వారం రోజులు అక్కడే ఉన్నారు. అనంతరం మహిళ షార్జా వెళ్లగా.. సచిన్ నోయిడాకు తిరిగివచ్చారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుని జీవించాలని నిశ్చయించుకున్నారు. అందుకోసం పాకిస్థాన్‌లో ఉన్న భూమిని విక్రయించి.. నలుగురు పిల్లలతో భారత్‌కు బయలుదేరింది. ముందుగా టూరిస్ట్ వీసాపై నేపాల్ వెళ్లిన ఆమె.. ఆ తర్వాత అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత రబుపరాలోని ఇంట్లో కాపురం పెట్టారు. పెళ్లికి కావాల్సిన ధ్రువపత్రాలను సమకూర్చుకునే పనిలో పడింది మహిళ. ఈక్రమంలోనే పోలీసులకు సమాచారం అందడం వల్ల.. శనివారం నలుగురు పిల్లలు సహా ప్రేమికుడితో పారిపోయింది. కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. హరియాణాలోని బల్లాభగఢ్లో వీరిని పట్టుకున్నారు.
"మహిళకు పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్‌లోని గులామ్ హైదర్‌తో 2014లో వివాహం జరిగింది. 2019లో అతడు పనికోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఈ క్రమంలోనే మహిళ పబ్జీ ఆడుతుండగా.. నోయిడాకు చెందిన సచిన్‌తో పరియచమైంది. వీరి వద్ద నుంచి రెండు వీడియో క్యాసెట్లు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక సిమ్, ఫ్యామిలీ రిజిస్ట్రేషన్, వివాహ ధ్రువీకరణ పత్రం, మూడు ఆధార్ కార్డులు, ఒక పాకిస్థాన్ ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం, పొఖారా- కాఠ్మండూ నుంచి దిల్లీకి బస్సు టికెట్లను స్వాధీనం చేసుకున్నాం."
--సాద్ మియా ఖాన్, డీసీపీ