కశ్మీర్ లోయలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు, తమ ఉనికి చాటుకునేందుకు.. ఉగ్రవాదులు, పాకిస్థాన్ ఐఎస్‌ఐ కొత్త మార్గాన్ని ఎంచుకున్నాయి. కశ్మీర్ లోయలో ఆయుధాలు, మాదకద్రవ్యాలు, సందేశాల చేరవేతకు ఐఎస్‌ఐ, ఉగ్రవాద సంస్థలు మహిళలు, పిల్లలను ఉపయోగిస్తున్నట్లు సైనిక ఉన్నతాధికారి తెలిపారు. ఇది చాలా ప్రమాదకరమైన అంశమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్రణ రేఖ వెంబడి తిష్ఠవేసిన మూకలు శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాల్లో ఉన్నాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సైనిక బలగాలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చినార్ కార్ప్స్ గా పిలిచే శ్రీనగర్‌కు చెందిన 15 కోర్ జీవోసీ లెఫ్టినెంట్ జనరల్ అమర్‌దీప్ సింగ్ ఔజ్లా తెలిపారు.
పాక్ ఐఎస్‌ఐ, ఉగ్రవాదులు ప్రస్తుతం సంప్రదాయ మొబైల్ కమ్యూనికేషన్ వాడకం తగ్గించాయన్నారు. ఉగ్ర సందేశాలు, మాదక ద్రవ్యాలు, ఆయుధాల చేరవేతకు ప్రత్యామ్నయంగా మహిళలు, బాలబాలికలను పావులుగా వాడుకుంటున్నాయని చెప్పారు. ఇది ప్రమాదకరమైన విషయమన్నారు. పాక్ ఐఎస్‌ఐ, ఉగ్రసంస్థలు అవలంబిస్తున్న ఇలాంటి కొన్ని ఘటనలను సైనికాధికారులు గుర్తించినట్లు తెలిపారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఇతర సంస్థలతో కలిసి సంయుక్తంగా కృషి చేస్తున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ ఔజ్లా చెప్పారు.
పొరుగుదేశం వైఖరిలో ఎలాంటి మార్పు లేదని.. తాజాగా ఉత్తర కశ్మీర్‌లోని మచిల్ సెక్టార్‌లో జరిగిన చొరబాటే ఉదాహరణ అని లెఫ్టినెంట్ జనరల్ ఔజ్లా పాక్‌పై మండిపడ్డారు. అయితే, కశ్మీర్‌లో శాంతి, సుస్థిరత స్థాపించే విషయంలో పురోగతి సాధించినట్లు చెప్పారు. నిరంతర సైనిక కార్యకలాపాలు, నిఘావర్గాల సమాచారంతో ఎప్పటికప్పుడు తీసుకుంటున్న చర్యలతో ఉగ్రవాదులపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఇప్పటికే చాలామంది కశ్మీర్ లోయను వీడగా.. మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లారు.
కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల సంఖ్య 33ఏళ్ల కనిష్ఠానికి చేరుకుంది. ఈ ఏడాది ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్లు కూడా తగ్గాయి. కశ్మీర్‌లో ఎల్‌వోసీ వెంబడి చొరబాట్ల సంఖ్య కూడా కొంత మేర తగ్గింది. ప్రత్యర్థి దేశాల కుట్రలను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం సహా భద్రతా సంస్థలు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ ఔజ్లా చెప్పారు. సహీ రాస్తా వంటి ఉగ్రవ్యతిరేక కార్యక్రమాలు అందుకు ఉదాహరణ అని తెలిపారు.
రాబోయే రోజుల్లో కశ్మీర్ లోయలో పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని లెఫ్టినెంట్ గవర్నర్ ఔజ్లా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల శ్రీనగర్‌లో నిర్వహించిన జీ-20 సదస్సు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి సమన్వయంతో పనిచేసిన భద్రతా బలగాలను.. లెఫ్టినెంట్ జనరల్ ఔజ్లా అభినందించారు.